మున్సిపల్ ఉద్యోగులు సమ్మె విరమించండి
– విధుల్లో చేరండి
– సమ్మెకాలానికి జీతం ఉండదు
– ఆర్మీ, పోలీసు బలగాలు రంగంలోకి
– జీహెచ్‌ఎంసీ కమీషనర్ సోమేష్
హైదరాబాద్ జూలై 13 (జనంసాక్షి):
తెలంగాణలో మున్సిపల్ కార్మికుల సమ్మెపై పీటముడి వీడలేదు. అటు ప్రభుత్వం ఇటు కార్మికులు భీష్మించుకోవడంతో సమ్మెకు పరిష్కారం దక్కలేదు. అయితే కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికులు మంగళవారంలోగా విధుల్లోకి హాజరుకాకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, తదితరులు హాజరయ్యారు. కార్మికుల మొడివైఖరిపై చర్చించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని గతంలోనే హావిూ ఇచ్చామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె విరమించి, రేపటికల్లా విధుల్లో చేరాలని హుకుం జారీ చేసింది. కాదని సమ్మె విరమించనట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. సమ్మె చేస్తున్నవారంతా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే… పర్మినెంట్ ఉద్యోగులు కాదనే విషయాన్ని ఉద్యోగులు గుర్తెరగాలని హితవుచెప్పింది. కార్మిక నేతల ఉచ్చులో పడి ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని, విధుల్లో చేరకపోతే ఆర్మీ, పోలీస్ బలగాలను రంగంలోకి దింపుతామని ప్రభుత్వం హెచ్చరించింది. తెలంగాణలో మున్సిపల్ పారిశుద్ద్య కార్మికుల సమ్మె వారం రోజులు పూర్తి అయింది. దీంతో తెలంగాణలోని హైదరాబాద్ తో సహా పలు పట్టణాలలో దుర్గంధం తీవ్రంగా వ్యాపిస్తోంది. తెలంగాణ మంత్రి నాయిని నరసింహారెడ్డి తదితరులు చర్చలు జరిపినా పెద్దగా ఫలితం లేదు. ఏ ప్రతిపాదనకు మంత్రులు ఔనని,కానని చెప్పడం లేదని, ముఖ్యమంత్రి కెసిఆర్ అందుబాటులో లేరని చెబుతున్నారని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. కాగా మరో వైపు మంత్రి జగదీష్ రెడ్డి మున్సిపల్ సమ్మెకు చట్టబద్దత లేదని అన్నారు. కాగా కొందరు దీనిపై మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే మున్సిపల్ శాఖను ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యవేక్షిస్తున్నందున ఆయనే దీనికి బాధ్యత వహించాలని కార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, సమ్మె విచ్చిన్నానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణపై కార్మిక సంఘాలవారు ఒక టిఆర్‌ఎస్ నేతపై కోడిగుడ్లతో దాడి చేశారు.ఎల్ బినగర్ లో మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. తమ డిమాండ్లు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న కార్మికులు నిరసనలో భాగంగా సర్కిల్ నెంబర్ 3 వద్ద ధర్నా చేపట్టారు. అదే సమయంలో టీఆర్‌ఎస్ నేత గోపాల్ అక్కడకు వచ్చారు. సమ్మె విరమించాలని కార్మికులకు సూచించారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కార్మికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆయన్ను నిలదీశారు. దీనితో గోపాల్ అక్కడి నుండి నిష్కమ్రించారు. ఈ తరుణంలో ఆయనపై కోడిగుడ్లతో దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ కార్మికులకు ఒక న్యాయం..మున్సిపల్ కార్మికులకు ఒక న్యాయమా అని కార్మిక సంఘ నేతలు ప్రశించారు. ఉద్యమనేతగా చెప్పుకుంటున్న సిఎం కెసిఆర్ కార్మికుల విషయంలో మొడిగా వ్యవహరించడం తగదన్నారు. దీనిపై తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. నిరసనలో భాగంగా ఖైరతాబాద్ సర్కిల్ నెంబర్ 10 కు పెద్ద ఎత్తున కార్మికులు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. జీహెచ్‌ఎంసీ కవిూషనర్ సోమేశ్ కుమార్ ఇక్కడకు చేరుకుని సమ్మె విరమించాలని కోరారు. వేతనాల పెంపు విషయంలో స్పష్టమైన వైఖరి వెల్లడించాలని కార్మికులు డిమాండ్ చేయడంతో సోమేశ్ కుమార్ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ వేతనాలు..ఇతరత్రా డిమాండ్లపై లిఖితపూర్వకంగా హావిూ ఇస్తేనే సమ్మెను విరమిస్తామని స్పష్టం చేశారు. వేతనాలు పెంచుతామని సమ్మెను విరమింప చేయాలని కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొనడం జరిగిందని, జీతాలు ఎంత పెంచుతారని కార్మికులు అడిగిన ప్రశ్నకు సోమేశ్ కుమార్ సమాధానం చెప్పలేదన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుడు వారి నాయకులతో చర్చించారని, ఆర్టీసీ కార్మికులకు ఒక రూలు..మాకొక రూలా అని పేర్కొన్నారు. ప్రధానంగా మున్సిపల్ కార్మికులు అంటే చాలా తక్కువ అని, అట్టడుగు ఉన్నారనే దృక్పథంలో ప్రభుత్వం ఉందని తెలిపారు. మహిళలు, ఎస్సీలని చూడకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. వెంటనే కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.