మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి
సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
కబ్జాకు గురైన నాళాలను పరిశీలించిన సీపీఐ నేతలు..
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 23 : చేర్యాల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ డిమాండ్ చేశారు. శుక్రవారం కబ్జాకు గురైన నాళాలు, చెత్తాచెదారంతో కూరుకుపోయిన డ్రైనేజీ కాలువలను సీపీఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. చేర్యాల పట్టణం పరిస్థితి పేరు పెద్ద ఊరు దిబ్బ అన్న చందంగా మారిందన్నారు. చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు భయంకరమైన గుంతలతో దర్శనమిస్తున్నాయని, ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మున్సిపాలిటీ నిధుల నుండి గుంతల మయంగా మారిన రోడ్లకు కంకర సిమెంట్ తో పూడ్చి మరమ్మతులు చేపట్టాలన్నారు. పట్టణంలో కబ్జాకు గురైన నాళాలను తెరిపించి మురికి నీటిని తొలగించాలన్నారు. డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వేదజల్లుతుందన్నారు. అధికారులు, పాలకులు ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలు త్వరగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య,మండల నాయకులు ఉడుగుల శ్రీనివాస్, పుల్లని వేణు, గూడెపు సుదర్శన్, ఇప్పకాయల వెంకటేష్, సకినాల బాల్ రాజు, ముస్త్యాల శంకరయ్య, ఆత్మకూరు హరికృష్ణ,శెట్టె శ్రీకాంత్, భోగి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area