మురిపించిన మూడేళ్ల పాలకమండలి
విశ్వనగరంగా చేయాలన్న కెసిఆర్ ఆశలు వమ్ము
గ్రేటర్‌ను వెక్కిరిస్తున్న నిధుల కొరత
అభివృద్ది పనులకు అందని నిధులు
రాబడి పెరిగినా తడిసి మోపెడవుతున్న ఖర్చులు
హైదరాబాద్,ఫిబ్రవరి12(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ పాలకమండలి మూడేండ్లు పూర్తిచేసుకున్నా నగరాభివృద్దిలో నానాటికీ తీసికట్టుగా తయారయ్యింది. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో వేలకోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థలో ముందడుగు, లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, డంపింగ్ యార్డ్ క్యాపింగ్ పనులు, నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, స్వచ్ఛ హైదరాబాద్‌కు గుర్తింపుగా పలు పురస్కారాలు అందుకున్నా అందుకు తగ్గట్లుగా క్షేత్రస్థాయిలో పనులు కానరావు. చెరువుల సుందరీకరణ తదితర విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పినా ఒక్క చెరువు కూడా పూర్తి కాలేదు. దాదాపు రూ. 50వేల కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నది. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర సర్కారు హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఖజానా క్రమేణా ఖాళీ అయ్యింది. గత జిహెచ్‌ఎంసి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు అద్దాల్లా మెరవాలన్న ప్రభుత్వపెద్దల ఆదేశాలతో అవసరమున్నా.. లేకున్నా కార్పెటింగ్ చేశారు. కొన్నిచోట్ల పనులు చేయకున్నా బిల్లులు పెట్టి కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. దీనిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంటింటికి ఉచితంగా చెత్త డబ్బాలకు రూ.29 కోట్లు, స్వచ్ఛ ట్రాలీలకూ కోట్లు ఖర్చు చేశారు. గ్రేటర్ ఆర్టీసీకి రూ.386 కోట్లు, వాటర్‌బోర్డుకు రూ.85 కోట్లు కేటాయించారు. ఉద్యోగుల వేతనాలు దాదాపు 43 శాతం పెరిగాయి. దీంతో ఖజానాపై అధిక భారం పడింది. ఆదాయం తక్కువగా ఉండడంతో ఖర్చులు పెరగడంతో ఇప్పుడు ఖజానా ఖాళీ అవుతోంది. సంస్థకు ప్రతినెలా ఆదాయం సగటున 250 కోట్లు కాగా.. ఖర్చు అంతకంటే ఎక్కువ వుతోంది. దీంతో ప్రతిపాదిత ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదు. విశ్వనగరంగా చేయాలన్న సిఎం కెసిఆర్ సంకల్పానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో కొలువుదీరిన గ్రేటర్ పాలకమండలి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఎప్పుడూ లేని విధంగా ఏకపక్ష విజయం కట్టబెట్టిన తరుణంలో ఎన్నికల హావిూలు నెరవేర్చాలంటే నిధుల కొరత పట్టి పీడిస్తోంది.ఓ వైపు ఖాళీ అయిన ఖజానా వెక్కిరిస్తుంటే.. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాక అయోమ యానికి గురవుతున్నారు. వేల కోట్లు అవసరమైన చోట.. లక్షల రూపాయల పనులకూ ఆలోచించాల్సి వస్తోంది. పాలక మండలి ఎన్నికై మూడేళ్లు పూర్తయ్యింది. ఈ యేడాదిలోనే వీలైనంత మేర అభివృద్ధి చేసి చూపెట్టాలని కార్పొరేటర్లు అభిప్రాయపడుతున్నారు. వేతనాల చెల్లింపునకే అవస్థలు పడుతోన్న సంస్థ అభివృద్దికి ఎలా అన్నది అంతుపట్టడం లేదు. గతంలో జీహెచ్‌ఎంసీలో రూ.400 కోట్లకు పైగా మిగులు నిధులు ఉండేవి. దీంతోపాటు మరో రూ.600కోట్ల వరకు వేతనాల చెల్లింపునకు రిజర్వ్ ఫండ్‌గా డిపాజిట్‌చేశారు. మిగులు నిధులతోపాటు రిజర్వ్ ఫండ్‌నూ డ్రా చేశారు. దీంతో పన్ను పెంచకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గతంలో పోలిస్తే ఆస్తిపన్ను ఆదాయం పెరుగుతోంది. ట్రేడ్ లైసెన్స్‌లపైనా ప్రత్యేకదృష్టి సారించారు. ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంటే మున్ముందు రోడ్ల మరమ్మతు, పారిశుధ్య నిర్వహణపైనా ప్రభావం పడుతుంది.