ముస్లిం రిజర్వేషన్లపై ఎందుకీ మౌనం
అసాధ్యమైనా మోసం చేస్తున్నారు: డిసిసి
నిజామాబాద్,జూన్22(జనం సాక్షి ): ముస్లిం రిజర్వేషన్ల పేరిట ముస్లిం మైనార్టీలను సిఎం కెసిఆర్ మోసం చేస్తున్నారని, 12శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని డీసీసీ అధ్యక్షుడు తాహిర్‌బిన్ హుడాన్ పేర్కొన్నారు. ఒకవేళ సాధ్యమే అయితే నాలుగేళ్లుగా ఎందుకు సాధించలేకపోయారని ప్రశ్నించారు. ఇటీవల ప్రధానిని కలిసిన సిఎం ఎందుకు దీనిపై అడగలేదో చెప్పాలన్నారు. ఇకపోతే గొర్రెల పంపిణీ పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేస్తామని సీడ్స్ ఇస్తే అవి సక్రమంగా లేక అనేక చేపలు మృతి చెందాయన్నారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో చేశామని చెబుతున్నారు కాని అది పూర్తిగా జరుగలేదని, ఇప్పటి వరకు నాలుగో విడతలో జరిగిన రుణమాఫీ వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికి బ్యాంకర్లతో ఎందుకు సమావేశం నిర్వహించలేదని పేర్కొన్నారు. బ్యాంకు అధికారులు రైతులకు రుణాలు ఇచ్చే విధంగా చూడాలన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఏమాత్రం చొరవ చూపడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై సుమారు పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు రైతులకు అందజేసే రుణాల విషయంలో రాష్ట్రస్థాయిలో బ్యాంకర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని, ప్రణాళికలను సైతం చేపట్టలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేల కోట్ల అప్పులు తెచ్చారన్నారు. ఇవన్నీ ఏం చేశారనిప్రశ్నించారు.