మూడు రాష్ట్రాల ఫలితాలతో పెరగనున్న కాంగ్రెస్‌ గ్రాఫ్‌

రాహుల్‌ నాయకత్వంపైనా కలగనున్న భరోసా
న్యూఢిల్లీ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికల్లో ముందుకు సాగాలన్న ఆశలేదని మాయావతి ప్రకటించారు. అలాగే సిపిఎం కూడా కాంగ్రెస్‌తో దోస్తీ కట్టేది లేదని చెప్పింది. ఇక బెంగాల్లో మాది ఒంటరి పోరే అని తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు. ఈ దశలో రాహుల గాంధీ కూడా తొందర పడడం లేదు. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలపై ఆయన దృష్టి కేంద్రీకరించారు. సర్వేలు అనుకూలంగా ఉండడంతో బిజెపి పాలిత మూడు రాష్ట్రాలతో పాటు, తెలంగాణలో అధికారంలోకి వస్తే రాహుల్‌ నాయకత్వం బలపడుతుంది. అప్పుడు ఆయనంటే అందరికి విలువ పెరుగుతుంది. అలాగే మూడు రాష్ట్రాల్లో గెలిస్తే  కాంగ్రెస్‌  ఇతర మిత్రపక్షాల వద్దకు వెళ్లి దేబిరించాల్సిన అవసరం రాదు. తమతో చేతులు కలపాల్సిందిగా అడిగేందుకు ఆయా పార్టీలే ముందుకు వస్తాయి. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆచరణలో పెట్టాలని చూస్తోంది. అందుకే రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడమెలా అన్న దానిపైనే ఎక్కువగా ఆధారపడి పనిచేస్తోంది.  ఇప్పటికే బిఎస్పి అధినేత్రి మాయావతి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు నిరాకరించి, స్వంతంగా పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. దేశంలో వామపక్షాలకు పెద్ద ఓటు బలం లేకపోయినప్పటికీ రైతులను, ఇతర శ్రామిక వర్గాలను సవిూకరించే శక్తి ఉన్నది. గతంలో హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, సీతారాం ఏచూరి ప్రతిపక్షాల మధ్య ఐక్యత ఏర్పర్చగలిగారు. కాని ఇప్పుడు సీతారాం ఏచూరి తన పార్టీలోనే బలమైన ప్రతిఘటనను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌తో కూటమి ఏర్పర్చే విషయంలోనూ, కలిసి పోటీ చేసే విషయంలోనూ ఏచూరి వైఖరికీ ప్రకాశ్‌ కారత్‌ వైఖరికీ మధ్య వైరుధ్యం ఉన్నది. తాము బలంగా
లేని చోట్ల బిజెపి ఓటమికి కృషి చేస్తామని, కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని తాజాగా కేంద్ర కమిటీ ప్రకటించింది. అసలు బిజెపి ఓటమికి బలంగా కృషి చేయగల స్వంత బలం సిపిఐ(ఎం)కు లేనప్పుడు పొత్తులతో కలసి పోతే బిజెపిని దెబ్బతీయగలదు. కానీ పిడివాదంతో కాంగ్రెస్‌తో జతకట్టమని చెబుతున్నారు. తెలంగాణలో కూడా బహుజన సమాఖ్య పేరుతో సిపిఎం ఉలిపికట్టె దారిలో పయనిస్తోంది. సిపిఎం వల్ల లాభపడేది అధికార టిఆర్‌ఎస్‌ మాత్రమే.  అందువల్ల దేశంలో కాంగ్రెస్‌ నేతృత్వంలో మహా కూటమి ఏర్పాటుకు మాయావతి, సిపిఐ(ఎం) రూపంలో ఇప్పటికే గండిపడింది. బిజెపి కూడా ఇదే  కోరుకుంటోంది. మూడు రాష్టాల్లో మాయావతి ఒంటరిగా పోటీ చేయడం వెనుక ఈడీ, సిబిఐ వంటి శక్తుల భయమే కారణమని అనుమానిస్తున్నారు. కానీ సిపిఎంకు అలాంటి భయం ఉండాల్సిన అవసరం లేదు. అందుకే బిజెపి మాయావతిని వెనక నుంచి ప్రోత్సహిస్తోందని అనుమానిస్తున్నారు. తెలంగాణలో కూడా సిపిఎం వల్ల కూటమి ఓట్లు చీలి తమకు లాభిస్తాయన్న ఆలోచనలో కమలనాధులు ఉన్నారు. అయితే ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు ఇలాంటి రాజకీయాలు పనిచేయకపోవచ్చు. మూడు బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాయావతి బిఎస్పీ వల్ల ఒనగూరే ప్రయోజనం గురించి బిజెపి అతిగా ఊహించు కుంటున్నట్లుగా ఉంది. బిజెపి వ్యతిరేక ప్రభంజనంలో కాంగ్రెస్‌ గెలిస్తే అది రాహుల్‌కే బాగా కలసి రానుంది. ఆయన నాయకత్వంపై భరోసా ఏర్పడనుంది.