మూడెకరాల హావిూలు విస్మరించారు: సిపిఐ
ఆదిలాబాద్,సెప్టెంబర్29(జనంసాక్షి): మూడెకరాల భూపంపిణీ పేరుతో 3 లక్షల దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్, కేవలం మూడు వేల కుటుంబాలకు మాత్రమే ఇచ్చారని సిపిఐ నేత మాజీఎమ్మెల్యే గుండా మల్లేవ్ తెలిపారు. ఇప్పుడు ఉన్న భూముల్లో హరితహారం పేరుతో మొక్కలు నాటుతున్నారన్నారు. హరితహారం కాస్తా దళితులకు ఉరితాడుగా మారిందని చెప్పారు. పోడు భూములను ప్రభుత్వం లాక్కొంటున్నదని, ఈ అంశంలో గిరిజనులకు తాము అండగా నిలబడ తామని తెలిపారు. సీమాంధ్రుల కంటే అన్యాయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని సీపీఐ నేత తెలిపారు. బ్యాంకుల్లో రైతుల రుణాలు పూర్తిగా మాఫీ కాని కారణంగా తిరిగి వారికి రుణాలు ఇవ్వడం లేదన్నారు. దీంతో రైతులకు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్దకే వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తిందని తెలిపారు. రైతులను పట్టించుకోని ఈ సర్కారు హరితహారం పేరుతో హంగామా చేస్తున్నదని విమర్శించారు. ఆ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ డబ్బును దుబారా చేస్తున్నదని తెలిపారు.