మూడోరోజు సాగిన ఆర్టీసీ సమ్మె
– రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపిన ఆర్టీసీ కార్మికులు
– గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత
– జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
– రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ భద్రత నడుమ రోడ్లెక్కిన బస్సులు
– పూర్తిస్థాయిలో రవాణాలేక ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు
హైదరాబాద్, అక్టోబర్7 జనంసాక్షి. : తమ సమస్యలను పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు ఉధృతంగా సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం, ఆయా జిల్లాల అధికారులు పోలీసుల సంరక్షణలో బస్సులను నడిపించారు. తాత్కాలికంగానే బస్సులు నడవటంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు వెళ్లిన ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వారికి అనుమతిలేదంటూ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ముందే అప్రమత్తమయ్యారు. గన్‌పార్కు వద్ద భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. నివాళులర్పించేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేయడంపై ఐకాస నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తమ త్యాగాల ఫలితంగా నేడు కేసీఆర్ అధికారంలో ఉన్నారని, అరెస్టులకు భయపడబోమని స్పష్టం చేశారు. అమరుల త్యాగాల వల్ల కేసీఆర్ సీఎం అయ్యారని, వారి నివాళులర్పించి హక్కు లేదా? అని నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తే లేదని, భవిష్యత్ కార్యాచరణలు త్వరలో వెల్లడిస్తామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఈ రావులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన ఆమరణ దీక్ష వాయిదా పడింది. పోలీసుల అనుమతి రానందున వాయిదా వేసుకున్నామని నేతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై ఎంఎ/-లాయీస్ యూనియన్ కార్యాలయంలో సమావేశం కావాలని నిర్ణయించారు. మరోవైపు, సమ్మెకు వెళ్లిన ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత న్యాయస్థానానికి వెళ్లాలని భావిస్తున్నారు. తమను తొలగించినట్టు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిపో అధికారులు తాత్కాలిక నియామకాలు చేపడుతున్నారు. టీఎస్ ఆర్టీసీలో కొత్త నియామకాల నేపథ్యంలో డ్రైవర్, కండక్టర్ అభ్యర్థులు డిపోల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.