మూడో రోజు కదలని బస్సులు

3

– పలు చోట్ల  ఉద్రిక్తత

హౖదరాబాద్‌,మే8(జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకూ 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి  మూడో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా పలుచోట్ల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల మధ్య ఘర్షణకు కొనసాగాయి. పలు చోట్ల పోలీసుల పహారా నడుమ బస్సులను నడిపించారు. అయితే బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రైవేట్‌ వాహనాలు దందా కొనసాగింది. కొన్ని డిపోల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దిష్టిబొమ్మను కార్మికులు దహనం చేశారు. 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చే వరకు సమ్మెను ఆపేది లేదని కార్మిక సంఘాలు నేతలు స్పష్టం చేశారు. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమ్మె విరమించి విధుల్లోకి రావాలన్న ఎండి పిలుపును కార్మిక సంఘాలు బేఖాతర్‌ చేశాయి. రహదారి రవాణా సంస్థ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరడంతో యాజమాన్యం కఠిన నిర్ణయాలకు తెరలేపింది. క్రమశిక్షణ నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ

ఉపసంఘంతో చర్చలకు సిద్ధమని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు.ఇదిలావుంటే ఎంసెట్‌ పరీక్షకు ఇబ్బంది కలక్కుండా చూడాలన్న వినతిని కూడా వారు తోసిపుచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్‌ ఇవ్వాలని కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మికులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఫలక్‌నుమా డిపో వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మకు కార్మికులు శవయాత్ర నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్‌కు  వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.  సమ్మె దృష్ట్యా ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంది. క్రమశిక్షణ నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. గుర్తింపు కార్మిక సంఘాలకు సదుపాయాలను తొలగించింది. రాష్ట్ర, జోనల్‌, జిల్లా, డిపో స్థాయిలో గుర్తింపు కార్మిక సంఘాలైన ఈయూ, టీఎంయూ, టీఎన్‌యూ, ఎన్‌ఎంయూలకు సౌకర్యాలు తొలగించనుంది. కార్మికుల వేతనాలనుంచి సభ్యత్వ రుసుము మినహాయించే సదుపాయం తొలగించింది. సదుపాయాల తొలగింపును వెంటనే అమలు చేయాలని రహదారి రవాణా సంస్థ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.

హన్మకొండలో ఉద్రిక్తత

వరంగల్‌ బస్టాండ్‌లో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తారంటూ ఆర్టీసీ ఎండీ శవయాత్ర చేపట్టి, దిష్టిబొమ్మను దగ్దం చేశారు.  అనంతరం బస్టాండ్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు కార్మికులు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణాలో ఆర్టీసీ లాభాల్లో ఉందని, తెలంగాణ ఉద్యమ పోరాటలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను విస్మరించటం మంచి పద్ధతి కాదన్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించి సమ్మె విరమణకు ప్రభుత్వం చొరవచూపాలని రాష్ట్ర విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జగదీశ్వర్‌ కోరారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా నర్సంపేట డిపో ఆవరణలో ఎన్‌ఎంయూ, టీఎంయూ, ఎస్‌టిడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సమ్మెకు తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత

ఆర్టీసీ కార్మికుల సమ్మె శుక్రవారం కొత్తగూడెంలో ఉద్రికతకు దారి తీసింది. అధికారులు తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను నడిపించేందుకు ప్రయత్నించారు. దీంతో బస్సులను అడ్డుకున్న కార్మికులను 1వ పట్టణ పోలీసులు అరెస్ట్‌  చేశారు. పోలీసు చర్యను నిరసిస్తూ ఓ కార్మికుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్ననికి పాల్పడ్డాడు.

పలు రైళ్లకు అదనపు బోగీలు

రోడ్డు రవాణా సంస్థ కార్మికుల సమ్మె కారణంగా దక్షిణమధ్య రైల్వే పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నుంచి ఇవాళ వెళ్లే నర్సాపూర్‌, త్రివేండ్రం, భువనేశ్వర్‌, మచిలీపట్నం, తిరుపతి, చెన్నై, కాకినాడ తదితర 13 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ఆర్టీసీకి భారీగా నష్టం

రెండ్రోజుల ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సంస్థకు రూ.1.25కోట్ల నష్టం వాటిల్లింది. సమ్మె ప్రభావం వల్ల జిల్లాలో 6 డిపోల పరిధిలో 500 బస్సులు నిలిచిపోయాయి. సమ్మెతో జిల్లాలో ఏర్పాటు చేసిన ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీకి వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్‌ వాహనదారులు ప్రయాణికుల రద్దీని సొమ్ము చేసుకుంటూ మూడు రెట్ల పైగా డబ్బులు వసూలు చేస్తున్నారు.సమ్మె వల్ల హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు.