మూతపడ్డ రంగురాళ్ల శిక్షణ కేంద్రం
ఖమ్మం,నవంబర్ 22: గిరిజన యువతకు రంగురాళ్ల తయారీలో శిక్షణ ఇచ్చేందుకు భద్రాచలంలో ఏర్పాటు- చేసిన శిక్షణ కేంద్రం మూలనపడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. శిక్షకుడికి జీతం కూడా ఇవ్వకపోవడం.. అధికారులు ఈ శిక్షణ కేంద్రంపై చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పవచ్చు. గిరిజన యువతకు రంగురాళ్ల శిక్షణ లభించి ఉంటే.. ఉపాధి అవకాశాలు కూడా లభించేవి. ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ శిక్షణ కేంద్రాన్ని తెరిపించేందుకు కూడా అధికారులు ప్రయత్నించకపోవడం వారి చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రంగురాళ్లు పుష్కలంగా లభిస్తాయి. వీటి నాణ్యతను గుర్తించడం, మెరుగుపెట్టడం తదితర విషయాల్లో గిరిజనులకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని భావించిన ఐటీడీఏ అధికారులు ఏడేళ్ల క్రితం భద్రాచలంలో రంగురాళ్ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. రెండు బ్యాచ్‌లు శిక్షణ కూడా పూర్తి చేసుకున్నాయి. ఆ తరువాత అధికారులు ఈ యూనిట్ నిర్వహణను గాలికొదిలేశారు. కాలానికనుగుణంగా కొత్త యంత్రాలు తెప్పించకపోవడం, శిక్షణపై శ్రద్ధ చూపకపోవడంతో శిక్షణ కేంద్రం మూతపడింది. యూనిట్ నిర్మాణం కోసం వెచ్చించిన లక్షల రూపాయలు వృథాగామారాయి.రంగురాళ్ల అమ్మకాల ద్వారా బయటి మార్కె ట్లో భారీగా గిరినేతరులు లబ్దిపొందుతుండగా అధికారుల నిర్లక్ష్యం మూ లంగా గిరిజన యువతకు శిక్షణ కూడా లభించడం లేదుఏజెన్సీలో అపారంగా రంగురాళ్లు భద్రాచలం నుంచి విశాఖపట్నం వర కు విస్తరించి ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో రంగురాళ్లు విరివిగా లభిస్తాయి. రంగురాళ్ల వ్యాపారం ద్వారా అధిక శాతం మంది భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు ఈ రంగురాళ్ల తయారీలో శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ఐటీడీఏ అధికారులు భద్రాచలం కేంద్రంగా రంగురాళ్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.