మూసీకి కొత్తగేట్ల బిగింపుతో మారిన మూసీ స్థితిగతులు

వరద నీటితో మూసి ప్రాజెక్ట్‌కు జలకళ

70 కోట్ల రూపాయలతో కాల్వల ఆధునీకరణ

నల్లగొండ,జూన్‌21(జ‌నం సాక్షి): 55 ఏండ్ల మూసీ చరిత్రలో కొత్త అధ్యాయానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మూసి ప్రాజెక్టు కింద ఆయకట్టు రైతుల ఇబ్బందుల్ని గుర్తించిన జిల్లా మంత్రి జగదీష్‌ రెడ్డి.. నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌ రావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు ఆధునికీకరణ,కాల్వల పునర్నిర్మాణ పనులను కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. కాల్వల నిర్మాణంలో చివరి ఆయకట్టుకు నీరందించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. యుద్ద ప్రాతిపదికన కొత్త గేట్లు బిగించేందుకు చర్యలు చేపట్టారు. తొలుత.. 19 కోట్ల రూపాయలతో.. కేవలం ఆరు నెలల్లోనే ప్రాజెక్ట్‌కుఉన్న 20 గేట్లను తొలగించి.. నూతన గేట్లను బిగించారు. ఆ తర్వాత మరో 70 కోట్ల రూపాయలతో కాల్వల ఆధునీకరణ కోసం చర్యలు చేపట్టారు. ఫలితంగా నేడు ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో మూసి ప్రాజెక్ట్‌ జలకళ సంతరించుకుంది. మూసీ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, తొలిసారి 634 అడుగులకు చేరింది. దీంతో 55 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. మూసీ ఆయకట్టు ద్వారా రెండవ పంటకు కూడా నీరందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.నల్లగొండ జిల్లా కేతెపల్లిలో నిజాం రాజు నిర్మించిన మూసి ప్రాజెక్టును.. గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. రైతులకు సాగునీరివ్వాలనే ఏకైక లక్ష్యంతో.. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు కొత్త కళను తీసుకొస్తుంది. అందులో భాగంగా? నిజాం కాలం నాటి మూసీ ప్రాజెక్టు రూపాన్ని పూర్తిగా మార్చేసింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు.. ఆది నుంచి యాసంగి పంటలకు మాత్రమే అరకొరగా నీరందిస్తూ వస్తోంది. చివరి ఆయకట్టుకు ఏనాడు నీరందలేదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మూసీ ప్రాజెక్ట్‌ ఆధునీకరణపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి.. చివరి ఆయకట్టు రైతుకు కూడా నీరందించేలా ఆధునికీకరణ పనులు ప్రారంభించింది. 19 కోట్ల రూపాయలతో కొత్త గేట్లు బిగించి.. మరో 70 కోట్ల రూపాయలతో కాల్వలను ఆధునీకరణ చేసింది. దీంతో చివరి ఆయకట్టు వరకు మూసీ కాల్వల్లో నీరు గల గలా పారుతుంది. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో పాటు.. దుందుభి, పాలేర్‌ వాగుల నుంచి భారీగా ఇన్‌ ఫ్లో వస్తుంది. ఇలాగే మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిస్తే.. ఇన్‌ ఫ్లో భారీగా పెరిగి.. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో పది రోజుల్లో కుడి, ఎడమ కాల్వల క్రింద సాగు నీటిని విడుదల చేయవచ్చని ఇరిగేషన్‌ అధికారులు చెప్తున్నారు. నిల్వ ఉన్న నీటికి తోడు ఇన్‌ ఫ్లో కూడా వస్తుండడంతో ఏ ఇబ్బందులు లేకుండా నీరు అందించనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అందించిన పంట పెట్టుబడి సాయంతో రైతులు వ్యవసాయానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు.ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు, మూసీ ప్రాజెక్టు ఆధునికీకరణపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా 40 వేల ఎకరాలకు సాగు నీటిని అందించాల్సిన ప్రాజెక్టు.. 10 వేల ఎకరాలకు అందించడం కూడా కష్టతరంగా మారింది. ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టి శిథిలమై పోయాయి. యాసంగిలో నీటిని విడుదల చేసినా.. ఎక్కడికక్కడ కాల్వలకు ఉన్న గండ్ల కారణంగా నీరు వృధాగా పోయేది. చివరి భూములకు చేరడం కలగానే మిగిలేది. గతంలో ఏ ప్రభుత్వాలు వానాకాలం పంటలకు కూడా సాగు నీరు ఇచ్చింది లేదు. కానీ, తెలంగాణ ప్రభుత్వం నీటి వృధాను అరికట్టేందుకు గేట్లకు మరమ్మత్తులు చేసి.. వచ్చిన నీటిని వచ్చినట్లు నిల్వ చేసింది. కాల్వలు కూడా బాగు చేయడం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందిస్తోంది. ఈ వానాకాలం సీజన్‌ లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలోని 40 వేల ఎకరాలకు సాగు నీరు విడుదల చేసేందుకు ఇరిగేషన్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు.