మూసీపై కనువిందు చేయనున్న పారిస్ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
మూసీపై కనువిందు చేయనున్న పారిస్ తరహా బ్రిడ్జిలు.. నేడు ఏడు చోట్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్ ముందు చూపుతో అనేక సంస్కరణలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి మంచి పర్యాటక కేంద్రంగా మారింది. అక్కడ ఏర్పాటు చేసిన పార్కు సైతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. దీంతో ఆ చెరువు పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులో మురుగునీరు చేరి కలుషితం కాకుండా.. జలమండలి ఆధ్వర్యంలో అక్కడ మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని 7 ఎంఎల్‌డీ సామర్థ్యంతో పూర్తి చేసింది. ఈ ఎస్టీపీతో పాటు చెరువులో రెండు చోట్ల మ్యూజికల్ ఫౌంటెయిన్‌ను సోమవారం (నేడు) మంత్రి కేటీఆర్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితో పాటు చారిత్రక మూసీ, ఈసీలపై ప్యారిస్ తరహాలో గ్రేటర్ నగరంలో హైలెవల్ బ్రిడ్జిల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.545 కోట్లతో మూసీ-ఈసీలపై మొత్తం 55 కిలోమీటర్ల మేర 15 బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగానే దాదాపు రూ.200 కోట్లతో ఏడు చోట్ల బ్రిడ్జిల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయగా.. ఈ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.