మూసీ ప్రక్షాళనపై సర్కారు దృష్టి

` లండన్‌ థేమ్స్‌ తరహాలో ఆధునికీకరణ
` థేమ్స్‌ రివర్‌ అపెక్స్‌ బాడీ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటి
హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగనుంది. లండన్‌ లోని థేమ్స్‌ నదిని తలపించేలా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం థేమ్స్‌ రివర్‌ అపెక్స్‌ బాడీ ప్రతినిధులతో లండన్‌ లో ఆయన సమావేశమయ్యారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో థేమ్స్‌ నది పరిరక్షణ, అభివృద్ధిలో ఏర్పడ్డ హార్డిల్స్‌ పై అడిగి తెలుసుకున్నారు. దావోస్‌ నుంచి లండన్‌ చేరుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి ఇక్కడ పర్యటించారు. మూసీ నదిపై హైదరాబాదు నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నాయి. వీటిలో పురానా పూల్‌  అత్యంత పురాతనమైనది. గోల్కొండను పాలించిన కుతుబ్‌ షాహీ వంశస్తుడైన ఇబ్రహీం కుతుబ్‌ షా 1578 లో నిర్మించాడు. ఈ వంతెన ఇప్పటికీ వాడుకలో ఉంది. నయాపూల్‌ వంతెన హైకోర్టు సవిూపంలో అప్జల్‌ గంజ్‌ వద్ద ఉంది. ఇవికాక డబీర్‌పూరా, చాదర్‌ఘాట్‌, అంబర్‌పేట, నాగోల్‌, ఉప్పల్‌ కలాన్‌ వద్ద కూడా వంతెనలు ఉన్నాయి. హైదరాబాదు నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాలలో వెలువడిన పారిశ్రామిక వ్యర్ధ పదార్దాలను నాలాల్లో వదలడం, గణనీయంగా పెరిగిపోయిన జనాభాతో నగరంలో మురికినీరును మూసీనదిలోకి వదలడంతో మూసీ ఒక మురికి కాలువగా మారింది.  ప్రతిరోజూ జంటనగరాల నుంచి వెలువడుతున్న 350 మిలియన్‌ లీటర్ల మురికినీరు, పారిశ్రామిక వ్యర్ధ పదార్దాలు నదిలో కలుస్తున్నవని అంచనా. లండన్‌ నగరంలోని థేమ్స్‌ నది తరహాలో మూసీ నదిని అభివృద్ది చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తున్నది. అలా చేయడం ద్వారా నగర సుందరీకరణతో  పాటు కాలుష్యం కోరల నుంచి హైదరాబాద్‌ ను బయట పడేయొచ్చని భావిస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లండన్‌ లో  థేమ్స్‌ రివర్‌ అపెక్స్‌ బాడీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తాము మూసీ అభివృద్ధి కోసం సహకరిస్తామని వారు తెలిపారు. ఇదిలావుంటే దావోస్‌ పర్యటనతో పెట్టుబుడలను ఆకర్శించడంలో సిఎం రేవంత్‌ విజయం సాధించారు. పెట్టుబడులను ఆకర్షించటంలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలోనే మొట్టమొదటి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ వేదికపై ప్రత్యేకతను చాటుకుంది. దావోస్‌ లో మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ భారీగా పెట్టుబడులకు తమ ఆసక్తి ప్రదర్శించాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద వెల్లువెత్తింది. దాదాపు రూ.40 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. దావోస్‌ లో జరిగిన డబ్ల్యూఈఎఫ్‌ వేదికగా 2020లో రూ.500 కోట్లు, 2022 లో రూ.4,200 కోట్లు, 2023లో రూ.21వేల కోట్ల పెట్టుబడులు రాగా.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ రెండు నెలల వ్యవధిలోనే అంతకు రెట్టించిన పెట్టుబడులు (దాదాపు రూ.40 వేల కోట్లు) రాష్టాన్రికి తరలివచ్చాయి. వీటితో 35 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. టాటా గ్రూప్‌, అదానీ, జిందాల్‌, గోడి ఇండియా, వెబ్‌ వెర్క్స్‌, ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌, గోద్రెజ్‌ ఇండియా, సర్జికల్‌ ఇన్‌స్టుమ్రెంట్స్‌ గ్రూప్‌ హోల్డింగ్స్‌, ఊబర్‌, క్యూ సెంట్రియో, ఓ9 సొల్యూషన్స్‌ లాంటి దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణలో వివిధ రంగాల్లో తమ ప్రాజెక్టుల స్థాపన, విస్తరణకు ముందుకు వచ్చాయి.