మృత్యుముఖంలో కన్నతల్లిపై ప్రేమ

వైరల్‌గా మారిని కెమెరా జర్నలిస్ట్‌ సెల్ఫీ

రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి):చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి నవంబరులో జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలని హెచ్చరిస్తూ మావోయిస్టులు సీఆర్పీఎఫ్‌ దళాలపై మంగళవారం కాల్పులకు తెగబడిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అందులో దూరదర్శన్‌ కెమెరా జర్నలిస్ట్‌ కూడా ఉన్నారు. ఈ కాల్పుల్లో ఎన్నికల కవరేజ్‌ కోసం వెళ్లిన దూరదర్శన్‌ వీడియో జర్నలిస్ట్‌ అచ్యుతానంద సాహు, మరో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు 450కివిూల దూరంలోని అటవీ ప్రాంతం నిల్‌వాయా గ్రామంలో ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న దూరదర్శన్‌ వీడియో జర్నలిస్టు మోర్‌ ముక్త్‌ శర్మ ఓ సెల్ఫీ వీడియో తీసి తన తల్లికి పంపించాడు. తమపై మావోలు దాడి చేశారని, ప్రస్తుతం ఎదురుగా మృత్యువు ఉన్నా తనకు భయం లేదని చెప్పడం వీడియోలో రికార్డయ్యింది. అమ్మ నువ్వంటే నాకేంతో ఇష్టం, వీలైతే నన్ను కాపాడండి. ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడడం కష్టమే. తమతో పాటు ఏడుగురు జవాన్లు ఉన్నారు. మమ్ముల్ని నక్సల్స్‌ చుట్టుముట్టారని అతడు ఈ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోలో కన్నతల్లిపై ఉన్న ప్రేమ, ఆప్యాయత కళ్లకు కడుతోంది. వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. మరోవైపు ఈ ఘటనలో మావోల చేతిలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.