మృత్యువుకు భయపడని ధీరుడు కాళోజీ
కేజీ టు పీజీ సీఎం కేసీఆర్ కల సాకారం చేస్తాం : మంత్రి కడియం
హైదరాబాద్,సెప్టెంబర్9 (జనంసాక్షి):
చావుకు కూడా భయపడని గొప్ప లక్షణం ప్రజాకవి కాళోజి నారాయణరావులో ఉండేదని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై కాళోజి విమర్శించే తీరు అద్భుతంగా ఉండేవన్నారు. కాళోజిలో ఉన్న ప్రశ్నించే తత్వాన్ని, ధైర్యాన్ని ప్రతీఒక్కరూ అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కడియం చెప్పారు. రవీంద్రభారతిలో జరిగిన కాళోజి 101వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రలు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల, కెవి రమణాచారి, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాళోజి పురస్కారాన్ని రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన వేణుగోపాల్‌రావుకు ప్రదానం చేశారు. అనంతరం కడియం తనను కలిసిన విలేకర్లతో మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ విద్యను పటిష్టం చేసి ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పిల్లలు కార్పోరేట్ సంస్థల్లో చదివిన ఇతర విద్యార్థులతో పోటీ పడే విదంగా ప్రభుత్వం మౌళిక వసతులు కల్పించినాణ్యమైన విద్యనందించేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. సీఎం డ్రీమ్ అయిన కేజీ టూ పీజీ ఉచిత విద్యను పకడ్బందీగా నిర్వహించేందుకే ఆలస్యం అవుతోందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌళిక వసతులు, నూతన భవనాల నిర్మాణానికి గాను 140 కోట్లను ఈ సంవత్సరం వెచ్చించనున్నామని శ్రీహరి తెలిపారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నామన్నారు. 2016-17 సంవత్సరం నుంచి కేజీటూపీజీ ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వసతులు లేని ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలకు ప్రహారీ గోడ, టాయ్‌లెట్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. 2015-16లో ఇంటర్‌విూడియెట్ స్థాయిలో ఎటువంటి ఫీజులేకుండా ఉచిత విద్యను అందించేందుకు ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఉచిత నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా 402 ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఒకలక్ష 40విద్యార్థులకు మేధా చారిటేబుల్ ట్రస్ట్ ద్వారా 6కోట్ల విలువైన పాఠ్యపుస్తకాలను అందించామన్నారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రతి నియోజకవర్గానికి పదికి తక్కువగా కుండా 1190 గురుకుల పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈగురుకులాల్లో 5వతరగతి నుంచి ఇంటర్ వరకు అంగ్ల మాధ్యమంలో విద్యను అందించనున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తుందన్నారు విద్యాలయంలో విద్యా వాతావరణాన్ని పెంచే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాలన్నారు.