మెక్సికోలో బాణసంచా కర్మాగారాల్లో పేలుళ్లు

– 24 మంది మృతి
– మరో 49మందికి తీవ్ర గాయాలు
మెక్సికో, జులై6(జ‌నం సాక్షి): మెక్సికోలోని తుల్‌పెటిక్‌ ప్రాంతంలో బాణసంచా కర్మాగారాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 24 మంది మృతి చెందారు. 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్మాగారంలో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు మొదటి పేలుడు సంభవించింది. వెంటనే దట్టమైన పొగ ఆ ప్రాంతాన్నంతా కప్పేసింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపడుతుండగా పక్కనే ఉన్న మరో తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. సహాయక చర్యల్లో పాల్గొన్న నలుగురు అగ్నిమాపక సిబ్బంది, అయిదుగురు పోలీసులు సహా మొత్తం 24మంది మృత్యువాత పడ్డారు. ఈ వరుస పేలుళ్లలో మరో 49మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని మెక్సికోకి చెందిన రెడ్‌ క్రాస్‌ సంస్థ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపింది. సంఘటన తెలిసిన అనంతరం పాఠశాల నుంచి వచ్చిన ఓ బాలుడు(14) ఆ కర్మాగారంలో పనిచేస్తున్న తన తండ్రి గురించిన సమాచారాన్ని పోలీసులను అడిగిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టేలా చేసింది. కొన్ని గంటల వ్యవధిలో బాలుడి తండ్రి ఒస్వాల్డో అర్బన్‌(43) సంఘటనా స్థలంలో తీవ్రగాయాలతో కనిపించాడు. ‘నేను దుకాణంలో పని చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. వెంటనే పొగ కమ్మేసింది. మొత్తానికి ప్రమాదం నుంచి బయటపడ్డాను’ అని అర్బన్‌ అక్కడున్న పోలీసులకు తెలిపాడు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటీన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. ఒక్కసారిగా వరుస పేలుళ్లు సంభవించడంతో మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు తెలిపారు.