మెగా టూరిజం

27 ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించిన కేంద్రం
న్యూఢిల్లీ : సుదూర సాగర తీరం, రమణీయమైన ప్రకృతి, చారిత్రక కట్టడాల గొప్పదనం, కొండలు, కోనలు వాటి మధ్య సన్నగా పారే సెలయేళ్లు.. ఇలా ఎన్నో వింతలు, విశేషాలకు మన రాష్ట్రం సెలవు పర్యాటకులకు ఆకర్షించగలిగేలా మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా ప్రభుత్వం అంతగా చర్యలు తీసుకోవడంలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం పర్యాటక శాఖ మంత్రిగా మన రాష్ట్రానికి చెందిన చిరంజీవి బాధ్యతలు చేపట్టడంతో పర్యాటకరంగానికి కొత్త ఊపు వచ్చింది. రాష్ట్రంలో పర్యాటకాభివృద్దికి కేంద్ర మే ముందుకొచ్చింది.
చిరంజీవి స్వయంగా ఆసక్తి ప్రదర్శించి ప్రాంతాలను సూచించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మాత్రం సరైన ప్రతిపాదనలు రావటం లేదని పర్యాటక శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. చివరికి చిరంజీవి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను పర్యాటక శాఖ అధికారులు గుర్తించారు. మొత్తం 27 ప్రాంతాలను ప్రాధాన్యం ప్రాజెక్టులుగా గుర్తించారు. వీటిని అభివృద్ది చేసేందుకు, పర్యాటకులకు అవసరమయ్యే మౌలికి సదుపాయాలు కల్పించేందుకు వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేస్తున్నారు.
వాస్తవానికి మహారాష్ట్ర, కేరళ కేరళ రాష్ట్రాల పార్యాటకాభివృద్ధి సంస్థలు కార్పొరేట్‌ కంపెనీల తరహాలో పనిచేస్తూ, వివిధ ప్రతిపాదనలతో ముందుకు వస్తున్నాయని, కానీ సొంత మంత్రి ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తరపున మాత్రం తమకు పెద్దగా ప్రతిపాదనలు రావటం లేదని కేంద్ర పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
చక్కటి ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులను మంత్రి చిరంజీవి ప్రోత్సహిస్తున్నారని, వారి ప్రతిపాదనలకు ప్రాధాన్యమివ్వాలని తమను ఆదేశిస్తున్నారని పర్యాటకశాఖ అధికారులు చెడుతున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాత్రం చాలా తక్కువ మంది ప్రజాత్రినిధులు ఇలా సమగ్రమైన ప్రతిపాదనలతో వస్తున్నారని వెల్లడించారు.విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, ఎమ్మెల్యే శ్రీనివాస్‌, రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారని తెలిసింది.
బడ్జెట్‌ హోటళ్లు,థీమ్‌ పార్కులు
మన రాష్ట్రంలో కోస్తా ,రాయలసీమ ,తెలంగాణ ప్రాంతాల వారీగా మొత్తం 27 ప్రాధాన్య ప్రాజెక్టులను కేంద్ర పర్యాటక శాఖ గుర్తించింది. ఆయా పర్యాటక స్థలాలను ఆధనీకరించి ,మెరుగైన వసతులు కల్పిస్తారు. వీటిలో భీమునిపట్నం., కాకినాడ , విజయవాడ, వరంగల్‌ , తిరుపతి లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. విశాఖపట్నం – భీమునిపట్నం మద్య టూరిస్ట్‌ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 43.87 కోట్లు నిధులను విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారి చేసింది.
కాకినాడ కేంద్రంగా కోనసీమను అభివృద్ది చేయనున్నారు కేరళను తలదన్నే రీతిలో కోనసీమ అందాలు ఉన్నప్పటికి వాటికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి జరగలేదు. ఈ నేపథ్యంలో కోనసీమ అందాలను జాతీయ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పడవలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే బడ్జెట్‌ హోటళ్లు , పర్యాటకుల సమాచార కేంద్రాలు , వాటర్‌ గేమ్స్‌ను కూడా అభివృద్ది చేయనున్నారు.
వివిధ దశలుగా చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 100 కోట్లను కేటాయించనున్నామని పర్యాటక శాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే విజయవాడలోని కొండపల్లి. బొమ్మలు , పురాతన గాందీ హిల్స్‌లను అభివృద్ది చేయనున్నారు. వరంగల్‌లోని కన్వెన్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలో అంతర్జాతీయ సదస్సులకు చిరునామాగా మారిన హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌ తరహాలో దీనిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి అవసరమయ్యే భూమినికూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే తరహా సెంటర్‌ను తిరుపతిలో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
తిరుపతిలో పాకశాస్త్ర విశ్వవిద్యాలయం
200 కోట్లతో తిరుపతిలో అంతర్జాతీయ పాకశాస్త్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత కార్నెల్‌ యూనివర్శిటి సంయుక్త సహాకారంతో కేంద్రపర్యాటక శాఖ దీన్ని ఏర్పాటు చేయనుంది. దీని ప్రాంతీయ శాఖను నోయిడాలో ఏర్పాటు చేస్తారు.
కేంద్రం రాష్ట్రంలో గుర్తించిన ప్రాజెక్టులు
– కోస్తా , రాయలసీమ (16 ప్రాజెక్టులు, 120.60 కోట్లు):
– మెగా సర్క్యూట్లు : పాపికొండలు ( 16.60 కోట్లు):
– కోనసీమ (16కోట్లు) ,కొండపల్లి 50 కోట్లు
– సర్య్కూట్లు : పీలేరు ( 8 కోట్లు)
గాందీ హిల్‌ – విజయవాడ (8 కోట్లు)
– డెస్టినేషన్‌ : కాకినాడ (5కోట్లు ) ,శ్రీకాకుళం (5కోట్లు) , వీరాపురం (5కోట్లు);
-భారీ ఆదాయం ఆర్జీంచే ప్రాజేక్టు : తిరుపతిలో కన్వెన్షన్‌ సెంటర్‌
-వేసైడ్‌ అమెనిటీస్‌ : కలికిరి 2కోట్లు ;నగిరి 5కోట్లు
-ఫేయిర్స్‌ ,ఫెస్టివల్‌ , ; ఫ్లేమింగో ఫెస్టివల్‌ -నెల్లూరు , కాకినాడ భీచ్‌ పెస్టివల్‌ ,లేపాక్షిపెస్టివల్‌ ,సూర్యలంక బీచ్‌ పెస్టివల్‌ -బాపట్ల ,అరకు టూరిస్ట్‌ ట్రైన్‌
-ఇన్‌స్టిట్యూషన్స్‌ : కాకినాడలో ఇండియన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం) స్థాపన
తెలంగాణలో 11ప్రాజెక్టులు ,54 కోట్లు

-మెగా సర్కూట్‌ :భద్రాచలం 16కోట్లు
సర్కూట్‌ : నిజామాబాద్‌ 8 కోట్లు
-కరీంనగర్‌ ఎలిగండ్ల కోట వద్ద సౌండ్‌ అండ్‌ లైట్‌ షో 5కోట్లు
ఆదిలాబాద్‌ బాసర వద్ద సౌండ్‌ అండ్‌ లైట్‌ షో 5 కోట్లు
-ఖమ్మంలో ట్యాంక్‌బండ్‌ పార్కు 5 కోట్లు
-భారీ ఆదాయం ఆర్జీంచే ప్రాజేక్టు : వరంగల్‌లో కన్వెన్షన్‌ సెంటర్‌
-వే సైడ్‌ అమెనిటీస్‌ : బీచుపల్లి – మహబూబ్‌నగర్‌ 5 కోట్లు
డిండి -నల్గొండ 5 కోట్లు
ఫెయిర్స్‌ అండ్‌ ఫెస్టివల్స్‌ : కాకతీయ ఫెస్టివల్‌ -వరంగల్‌
-ఇన్‌స్టిట్యూషన్స్‌ : హైదరాబాద్‌లో కేంద్రియ ఇండియన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (సెంట్రల్‌ ఐహెచ్‌ఎం) స్థాపన