మెజార్టీ భారతవిద్యార్థులు బోగస్?
లండన్: బ్రిటన్‌లోకి ప్రవేశించిన భారత విద్యార్థుల్లో సగానికి పైగా బోగస్ అని నివేదికను తెలియజేసింది. 2011లో దాదాపు 63 వేల మంది బోగస్ విద్యార్థులు భారతదేశం నుంచి బ్రిటన్‌లో ప్రవేశించారని, ఇది 59శాతమని బ్రిటిష్ కాంపైన్ గ్రూప వెల్లడించింది. యుకె మైగ్రేషన్ వాచ్ హోం ఆఫీస్ పైలట్ స్కీమ్ కింద అధ్యయనం చేసి వివరాలను వెల్లడించింది. బ్రిటన్‌కు వస్తున్న బోగస్ విద్యార్థుల్లో మయన్మార్ మొదటి స్థానం అక్రమించగా, భారత్ రెండో స్థానంలో ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. భారత్‌తో సమాన స్థానాలు బంగ్లాదేశ్, నైజీరియాలు ఆక్రమించినట్లు తెలిపింది. ఖచ్ఛితంగా విద్యార్థులేనా కాదా అని తేల్చుకోవడానికి సంస్థ విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూ చేసింది. క్రెడిబిలిటీ ప్రాతిపదికగా 63వేల మంది విద్యార్థుల వీసాలను తిరస్కరించవచ్చునని అభిప్రాయపడింది. వీరిలో 61శాతం మంది ప్రైవేట్ నిధులు సమకూరుస్తున్న కాలేజీలకు, 17శాతం మంది ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న కాలేజీలకు, 14శాతం మంది యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. హోం ఆఫీస్ ఈ ఏడాది పదివేల మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేయాలని తలపెట్టింది. భారీగా దుర్వినియోగం జరుగుతుందని, బోగస్ విద్యార్థులు ఇక్కడికి
వచ్చి ఉద్యోగాలు చేస్తూ బ్రిటిష్ వారి ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని మైగ్రేషన్ వాచ్ చైర్మన్ ఆండ్య్రూగ్రీన్ అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియాల్లో మాదిరిగా బ్రిటన్‌లో ఎగ్జిట్ తనిఖీలు లేవని, ఇది కూడా సమస్యగాను ఉందని గ్రీన్ అన్నారు. ఇక్కడికి వచ్చిన విద్యార్థుల్లో ఎంత మంది తిరిగి వెళ్లిపోయారనే లెక్కలు కూడా లేవని అన్నారు.