మెట్రో రైళ్లు వచ్చేశాయ్!

metro-train1హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ట్రాఫిక్ చిక్కులు చీల్చుకుంటూ, పర్యావరణానికి విఘాతం కలుగకుండా పరుగెత్తేందుకు అవసరమైన రైళ్లు, బోగీలు భాగ్యనగరానికి పూర్తిస్థాయిలో చేరుకున్నాయి. దక్షిణకొరియా హుండాయ్ రోటెబ్ నుంచి హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ విడతలవారీగా వాటిని దిగుమతి చేసుకున్నది. రెండ్రోజుల క్రితం చివరి రైలుతోపాటు బోగీ కూడా నగరానికి రావడంతో ప్రాజెక్టుకు అవసరమైన రైళ్లన్నీ చేరుకున్నట్టయింది. ట్రాక్‌పై మూడు కోచ్‌లతో ప్రయాణించే ప్రతిరైలులో వేయి మంది ప్రయాణించే సౌలభ్యం ఉన్నది. 72 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లుగా నిర్మిస్తున్న ప్రాజెక్టుకు అవసరమైన 57 రైళ్లను దిగుమతి చేసుకున్న మెట్రోరైలు అధికారులు వాటిని ఉప్పల్ డిపోలో ఉంచారు. 171 బోగీలు కూడా అక్కడే ఉంచారు. ఆర్వోబీలు పూర్తయిన వెంటనే కారిడార్ 1, 2ల ద్వారా ఇవి పరుగులు పెట్టనున్నాయి. 

గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైళ్లను డిజైన్‌చేయగా సగటున గంటకు 33 కిలోమీటర్ల వేగంతో నగరంలో ప్రయాణించనుంది. అవసరాన్ని బట్టీ రైలుబోగీలను మూడు నుంచి ఆరు వరకు పెంచుకునే సౌలభ్యం ఉంది. సీఎం కేసీఆర్ మెట్రోరైలు సేవలు అతి త్వరగా అందుబాటులోకి తేవాలని చెప్పడంతో రైళ్లను సిద్ధం చేశారు. ఆధునాతన సౌకర్యాలు మెట్రోరైళ్లలో ఉన్నాయి. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటక్షన్, ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్స్, ఆటోమేటిక్ ట్రైన్ సూపర్‌విజన్, ప్యాసింజర్ ఎమర్జెన్సీ అలారం, ప్యాసింజర్ అడ్రసింగ్ సిస్టం, సీసీటీవీ సర్వేలెన్స్ కోచ్‌లు, ఎయిర్‌బ్రేక్ సిస్టం, స్మోక్ అండ్ ఫైర్ డిటెక్టర్స్, అగ్ని నిరోధక యంత్రాలు, లైట్ వేయిట్ స్టేయిన్‌లెస్ స్టీల్ బాడీ కోచ్‌లు, ఆటోమేటేడ్ డోర్‌సిస్టం వంటి వసతులున్నాయి.