మెట్రో సంపూర్ణం కావాలంటున్న ప్రజలు

హైదరాబాద్‌ మెట్రో మూడురోజుల అనుభవంతో ప్రయాణికుల్లో విశ్వాసం పెరిగింది. ఇతర మార్గాల్లో నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. సకాలంలో గమ్యం చేరుకోవాలని, ట్రాఫిక్‌ ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఆఫీస్‌కు చేరుకోవాలని కోరుకుంటున్న వారు మెట్రో మార్గాలు త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే నాగోలు-మియాపూర్‌ మధ్యప్రయాణిస్తున్న వారు తమ గమ్యాలు మరికొంత దూరమైనా మెట్రోను ఆశ్రయించినట్లు చెబుతున్నారు. మొత్తంగా హైదరాబాద్‌ మెట్రో అనుకున్న లక్ష్యాలను సాధించబోతున్నదని రుజువు అవుతోంది. చక్కగా ఏసీలో కుదుపుల్లేని ప్రయాణంతో పాటు సకాలంలో ఆఫీసుకు వెళ్లిరావచ్చన్న ధీమా పెరిగింది. తిరుగు ప్రయాణంలో స్టేషన్‌లోనే కావలసినవన్నీ కొనేసుకుని ఇంటికి చేరుకోవచ్చన్న భరోసా కలిగింది. మెట్రో రైళ్లు పూర్తిస్థాయిలో అన్ని మార్గాల్లో తిరగడం మొదలెడితే హైదరాబాదీల దినచర్యలో ఊహించని మార్పులు రానున్నాయి. తొలిదశ మెట్రో ప్రారంభం తరవాత ఇప్పుడు ప్రజలకు పబ్లిక్‌ రావాణాపై భరోసా పెరిగింది. అలాగే నాగోలు-మెట్రో రూటులో వ్యక్తిగత వాహనాలు రద్దీ కూడా తగ్గిందని అంటున్నారు. ఇకపోతే తొలిరోజు మెట్రోరైలులో రికార్డు స్థాయిలో రెండు లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు ప్రకటించారు. అనుకున్న దానికంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదించినట్లు చెప్పారు.ప్రయాణికుల తాకిడికి అనుగుణంగా మియాపూర్‌- అవిూర్‌పేట, నాగోలు-అవిూర్‌పేట స్టేషన్ల నడుమ 360 ట్రిప్పులు నడిపామన్నారు. మూడురోజులుగా అదే ఉత్సాహం కన్పించడం వల్ల్‌ మెట్రో నిర్వాహకులకు కూడా లక్ష్యాన్‌ఇన చేరుతున్నామన్న విశ్వాసం కలుగుతోంది. మెట్రోరైళ్లన్నీ రద్దీగానే నడిచాయి. స్టేషన్లు జనంతో కిటకిటలాడాయి. అవిూర్‌పేట కూడలి స్టేషన్‌లోనైతే… ప్లాట్‌ఫాంపై నిలబడేందుకు చోటు లేనంతగా జనం ఎగబడ్డారు. నాగోలు, ఉప్పల్‌ స్టేషన్లలో రద్దీ మరింత పెరిగింది. మియాపూర్‌ దగ్గరా అదే పరిస్థితి కనిపించింది. సాధారణ ప్రయాణికులతో పాటూ… తొలిసారి మెట్రో ప్రయాణ అనుభూతి కోసం వచ్చినవారూ ఇందులో ఉన్నారు. స్టేషన్లలో యంత్రాలు, ఎస్కలేటర్లలో సాంకేతిక సమస్యలు మినహా… లక్షల మంది ప్రయాణికులు వచ్చినా మెట్రోరైళ్లు అవాంత రాలు లేకుండా సాఫీగా సాగిపోవడంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోంది. 2లక్షల మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ మెట్రో రికార్డు నెలకొల్పిందని మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేయడం చూస్తుంటే అందులో అతిశయం లేదనిపిస్తోంది. గురువారం ఆయన వేర్వేరు ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించి, ప్రయాణికుల స్పందనను తెలుసుకున్నారు. పట్టణీకరణా జనాభా పెరుగుదలా ప్రపంచమంతటా ఉన్న సమస్యే. దాని వల్ల నగరాల్లో వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగి రహదారులు ఇరుకైపోతున్నాయి. ట్రాఫిక్‌ జాములతో గమ్యం చేరడానికి గంటలు గంటలు వెయిట్‌ చేయాల్సి వస్తోంది. వీటిని అధిగమించడానికి ఏం చేయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. రవాణా సాధనాల అభివృద్ధితో పాటూ అదీ పెరుగుతూ వచ్చింది. ఇలా రద్దీని తగ్గించడానికి పట్టణాలు,నగరాలకు ప్రత్యేకించిన రవాణా వ్యవస్థ అవసరం ఏర్పడింది. మనదేశంలో ఇప్పటికే తొమ్మిది నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు పనిచేస్తున్నాయి. పదోదిగా ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రో అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఇంకా పలు నగరాల్లో మెట్రో నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎలాగయితేనేం అనేక అవరోధాలను దాటుతూ, గడువుల విూద గడువులు పొడిగించుకుంటూ సాగిన హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు ప్రారంభించడంతో శతాబ్దాల చరిత గల ఈ మహానగరి మకుటంలో మరో కలికితురాయి వచ్చి చేరినట్లైంది. మెట్రో కలను సాకారం చేసుకోవడం ద్వారా ఢిల్లీ, జైపూర్‌, ముంబయి,కొల్‌కతా, చెన్నై, బెంగళూరు, కోచి నగరాల సరసన హైదరాబాద్‌ చోటు సంపాదించుకుంది. సుమారు ఇరవై వేల కోట్ల రూపాయల వ్యయంతో మూడు కారిడార్లు, 72 కి.విూ. పొడవు కలిగిన ఈ మెట్రో రైలు ప్రాజెక్టుతో హైదరాబాద్‌ మరింత ఆధునికతను సంతరించుకుంది. మెట్రో రైల్వే స్టేషన్లను ఆనుకుని ఉన్న ప్రాంతాల అభివృద్ధికి ఇది కొత్త బాటలు పరుస్తుంది. మెట్రో రైలు పట్టాలపైకి ఎక్కడం వల్ల నగర వాసుల సమయం, ఇంధనం ఎంతో ఆదా అవుతుంది. అంతేగాకుండా ట్రాఫిక్‌ చిక్కులు తొలగిపోగలవన్న భరోసా ఈ మూడు రోజుల ప్రయాణంతో అనుభవంలోకి వచ్చింది. వేగంగా విస్తరిస్తున్న నగర జనాభా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న ప్రైవేట్‌ వాహనాలు, ఇరుకైన రహదారుల మూలంగా తలెత్తే ట్రాఫిక్‌ రద్దీ వంటి సమస్యల నుంచి బయట పడాలనుకునే వారికి ఈ మెట్రో హాయిని ఇస్తోంది. మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రజల ఆదరణ చూరగొనాలంటే అన్ని రూట్లు త్వరగా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రజలు భారమైనా సమయం ఆదా కావాలని కోరకుంటున్నారు. అందుకే ధరలు అధికంగా ఉన్నాయని వస్తున్న విమర్శలను వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదేమైనా తీవ్రమైన కృషి, పట్టుదలతో హైదరాబాద్‌ మెట్రో సాకారం చేసిన వారంద రికీ ఈ సందర్భంగా అభినందనలు చెప్పాలి. తొలి రోజు మెట్రో రైల్‌ లో ప్రయాణించేందుకు నగరవాసులు మెట్రో స్టేషన్ల వద్ద బారులు తీరినట్లుగానే మూడోరోజు అదే పరిస్థితి కనిపించింది.ఉప్పల్‌ నుంచి మియాపూర్‌ వరకు వెళ్లే మెట్రో రైల్‌ లో వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో మెట్రో స్టేషన్ల వద్దకు చేరుకుంటున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి మెట్రో ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. మెట్రో రైలులో ప్రయాణిస్తూ సెల్ఫీలు, ఫొటోలు దిగుతుండటంతో సందడి నెలకొంది. మిగతా రూట్లు కూడా త్వరగా అందుబాటులోకి వస్తే తమ కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. మొత్తంగా హైదరాబాద్‌కు మెట్రో భాగ్యం అన్నది ఓ చారిత్రక ఘట్టంగా మిగిలి పోనుంది.