మెమన్‌కు 30న ఉరి
– క్షమాభిక్ష పిటీషన్ కొట్టివేత
ముంబయి,జులై21(జనంసాక్షి):
ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టివేసింది. ఉరిశిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని యాకూబ్ మెమన్ కోరగా న్యాయస్థానం నిరాకరించింది. దాంతో ఈ నెల 30న అతనికి ఉరిశిక్ష అమలు చేయనున్నారు. నాగ్‌పూర్ సెంట్రల్‌జైల్‌లో కాని, పుణె ఎరవాడ జైలులో కానీ 53 ఏళ్ల మెమన్‌కు శిక్షను అమలుచేసే అవకాశం ఉందని నాగ్‌పూర్ జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయ్ తెలిపారు.1993 పేలుళ్లకు సంబంధించిన కేసులో ఇదే తొలి మరణశిక్ష కానుంది. ఆనాటి వరుస పేలుళ్లలో 250 మంది మృతిచెందారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిని వణికించిన 13 వరుస పేలుళ్ల పథకాల అమలుకు మెమన్ వనరులు సమకూర్చినట్లు నిర్దారితమవడంతో 2007లో ముంబయిలోని తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం మెమన్‌ను దోషిగా తేల్చి ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం అతను నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. శిక్ష అమలుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఇప్పటికే ఆమోదం తెలిపినట్లు సమాచారం. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన యాకూబ్ మెమన్ సోదరుడు టైగర్ మెమన్‌గా పేరొందిన ఇబ్రహీం మెమన్ ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు. 1993 తర్వాత అతను దేశం వదిలి వెళ్లిపోయాడు.