మెహబూబాను పరామర్శించిన సోనియా
శ్రీనగర్,జనవరి10(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని ఆదివారం శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిశారు. జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి, మెహబూబా తండ్రి ముఫ్తీ మహమూద్ సయీద్ అనారోగ్య కారణంతో గడిచిన గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ నేడు మెహబూబాను కలిసి పరామర్శించారు. సోనియాతో పాటు రాజ్యసభ విపక్షనేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంబికా సోనీ, జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీ.ఏ.మిర్, పార్టీ నాయకులు సైఫుద్ధీన్ సోజ్‌లు మోహబూబాను పరామర్శించిన వారిలో ఉన్నారు. జమ్మూకాశ్మీర్ దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ సమాధి దగ్గర ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతనాగ్ జిల్లాలోని ఆయన స్వగ్రామం బిజ్ బెహరాలో సయీద్ ను ఖననం చేశారు. సయీద్ కుమార్తె మెహబూబా సహా కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మరోవైపు, సయీద్ కుటుంబాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరామర్శించారు. సయీద్ కుమార్తె, ఎంపీ మెహబూబా ముఫ్తీని కలిసిన సోనియా? ఆమెను ఓదార్చారు. సోనియా వెంట రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ సహా పలువురు ముఖ్య నేతలున్నారు. ముఫ్తీ కుటుంబంతో సోనియా గాంధీకి సుధీర్ఘకాలంగా అనుబంధం ఉందని, ఆయన మరణంతో శోకంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆమె వచ్చినట్లు ఆజాద్ చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ముఫ్తీ కుటుంబాన్ని పరామర్శించారు.ఇదిలావుంటే జమ్మూకశ్మీర్‌లో శనివారం రాత్రి గవర్నర్ పాలన విధించారు. ఈమేరకు కేంద్ర ¬ంశాఖ ప్రతినిధి ఢిల్లీలో ప్రకటించారు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కింద తనకు సంక్రమించిన అధికారం ప్రకారం గవర్నర్ .. రాష్ట్రపతి ఆమోదంతో గవర్నర్ పాలన విధించి ఉత్తర్వులు జారీ చేశారని, ఇది ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చిందని రాజ్‌భవన్ ప్రతినిధి తెలిపారు. సీఎం సయీద్ అనారోగ్యంతో కన్నుమూయడం, కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సమయం పట్టనుండటంతో రాజ్యాంగ శూన్యతను నివారించేందుకు గవర్నర్ పాలన అనివార్యమైంది. తండ్రి మరణం నేపథ్యంలో రాష్ట్రంలో ప్రకటించిన నాలుగు రోజుల సంతాప దినాలు పూర్తికాకుండానే కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు సయీద్ కుమార్తె, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విముఖత వ్యక్తం చేయడంతో గవర్నర్ పాలన విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆమె సీఎం పదవి చేపట్టేందుకు 28 మంది పీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలసి ఇప్పటికే మద్దతు తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సయీద్ గురువారం మరణించడం తెలిసిందే. మరోవైపు ఆదివారంతో సంతాపం దినాలు ముగియనుండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని పీడీపీ సంకీర్ణ భాగస్వామి అయిన బీజేపీ తెలిపింది. నూతన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ మధ్య భేదాభిప్రాయాలు, షరతులు లేవని పీడీపీ, బీజేపీలు అంతకుముందు పేర్కొన్నాయి. కాగా, రాష్ట్రంలో గవర్నర్ పాలన ఇంకా విధించనప్పుడు జమ్మూకశ్మీర్‌ను ఎవరు పాలిస్తున్నారో అర్థం కావట్లేదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.