మేం చేస్తున్న విమర్శలే నిజమయ్యాయి: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ,నవంబర్‌7(జ‌నంసాక్షి): రూ.500, 1000 నోట్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయపై గతేడాదిగా వస్తున్న విమర్శలను సానుకూల ధోరణిలో ఆలోచన చేయకపోవడం వల్ల అసలు నిజాలను ప్రధాని మోడీ గుర్తించలేకపోయారు. విపక్ష కాంగ్రెస్‌ సహా దాదాపు అనేక పార్టీలు ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతూ వచ్చాయి. ఈ నిర్ణయం సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలుగచేసేదిగా ఉందన్న వారి వాదనలే నిజంఅయ్యాయి. రద్దు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పు పట్టింది. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం కారణంగా నోట్ల చలామణి విషయంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ధ్వజమెత్తింది. ఏడాదిగా చేస్తున్న విమర్శలు నిజమే అని తేలిపోయిందని పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా అన్నారు. ఆనాడు తాము చేసిన విమర్శలు నేటికీ అక్షర సత్యాలుగా నిలిచాయని అన్నారు. నల్లధనంపై చర్యలు తీసుకునే విషయంలో తమ పార్టీ మద్దతు ఇస్తుందని, అయితే అది అర్థవంతంగా, నిర్దిష్టంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న రూ.80లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి రప్పించి ప్రతీ పౌరుడికి రూ.15లక్షల చొప్పున ఇస్తానన్న హావిూని నిలబెట్టుకోలేకపోవడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని రుజువయ్యిందని రణదీప్‌ ఆరోపించారు. నల్లధనం హావిూపై ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ నిర్ణయం తప్ప మరోటి కాదన్నారు. తప్పుడు నిర్ణయంతో సామాన్య ప్రజల్లో ఏడాదిగా తీవ్ర గందరగోళం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక అవివేకంతో తీసుకున్న నిర్ణయమన్నారు. నల్లధనాన్ని వెనక్కి రప్పించడంలో విఫలమవ్వడంతో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. నోట్లరద్దు, జిఎస్టీ సత్ఫలితాలు ఇవ్వలేకపోయిందని అన్నారు. విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.