మేక్ ఇన్ ఇండియా పరిధిలోనికి రైతులు రారా?
– లోక్‌సభలో సర్కారుపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ,ఏప్రిల్29(జనంసాక్షి):మేక్ ఇన్ ఇండియా పరిధిలోనికి రైతులు రారా అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు.రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. మేక్ ఇన్ ఇండియా అంటే రైతులు పండించే ధాన్యం కాదా అని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. దీంతో అధికార పక్ష సభ్యులు రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ.. పదేళ్లుగా రాహుల్ గాంధీ ఎక్కడకెళ్లారని నిలదీశారు. ఇప్పుడు రైతు సమస్యలపై ఎందుకు మట్లాడుతున్నారని అడిగారు. ఇవాళ రైతుల సమస్యలు గుర్తుకొస్తున్నాయా? అని మండి పడ్డారు. మార్కెట్లలో ధాన్యం మద్దతు ధరలకు కొంటుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పంజాబ్ కాదు అమేథీ వెళ్లి చూడాలని చురకలంటించారు. అంతకుముందు మాట్లాడిన రాహుల్ రైతుల ఆత్మహత్యలు, పంట నష్టంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను కేంద్రం పట్టించుకోవడం లేదంటూ విమర్శలు సంధించారు. రాహుల్ ప్రసంగాన్ని అధికార పక్ష సభ్యులు అడ్డుకున్నారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం చెలరేగింది. దేశంలో రైతులు, పేదల వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని రాహుల్ విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మేక్ ఇన్ ఇండియాలో రైతులు భాగస్వాములు కారా? అని నిలదీశారు. ప్రధాని మోదీ పంజాబ్ వెళ్లాలి, రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడే ప్రధాని రైతుల సమస్యలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ తరచుగా విదేశీ పర్యటనలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. బుధవారం లోక్సభలో రైతుల ఆత్మహత్యలపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొన్నాళ్లుగా మోదీ దేశంలోనే ఉంటున్నారు… ఈ నేపథ్యంలో పంజాబ్ వెళ్లి రైతుల పరిస్థితిని ఓ సారి పరిశీలించాలని రాహుల్ గాంధీ… ఈ సందర్భంగా మోదీకి సూచించారు. అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యాలపై సభలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, హరిసిమ్రత్ కౌర్ మండిపడ్డారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది…. ఆ సమయంలో రాహుల్ గాంధీ ఏ ప్రాంతానికి వెళ్లి రైతులను పరిశీలించారని హరిసిమ్రత్ కౌర్ ప్రశ్నించారు. వెంకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ప్రజల సంక్షేమం కన్నా రాజకీయం ముఖ్యమన్నారు. తాము సమాధానం చెప్పడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు. మంత్ని పాశ్వాన్ రాహుల్ లేవనెత్తిన అంశాలపై సమాధానం ఇస్తారని అన్నారు. రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోబోమన్నారు. రాహుల్ లేవనెత్తిన సమస్యలపై పౌరసరఫరాల శాఖ మంత్రి పాశ్వాన్ ధీటుగా జవాబిచ్చారు. ఎక్కడా రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు. అలాగే మార్కెట్లలో ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని ఇప్పుడు ఎన్‌డిఎ సర్కార్ చేసి చూపిందన్నారు.