మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

4

– మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి 13(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న మేడారం జాతరకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మేడారం జాతరకు ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ, ప్రణాళికను ఆయన ఈటీవీ తెలంగాణ వేదికగా ప్రజలతో పంచుకున్నారు. పలు ప్రాంతాల నుంచి ఫోన్లు చేసిన భక్తులకు సందేహాలను నివృత్తి చేశారు. ఈసారి జాతరకు కోటి 25లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆసియా ఖండంలో మేడారం లాంటి వన జాతర మరెక్కడా జరగదని అన్నారు. మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తెలిపారు. మేడారం జాతరకు సంబంధించి గిరిజన పూజారుల సూచనల మేరకే సంప్రదాయాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. రవాణా సదుపాయాలపై రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమావేశాలు, సవిూక్ష నిర్వహించినట్లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల కోసం నైపుణ్యం గల డ్రైవర్లతో 3,600 బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు. భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా 25 కిలోవిూటర్ల మేర పైపులైన్లు వేశామని.. 16వ తేదీ నుంచి అన్ని నల్లాల్లోనూ నీళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 17న సారలమ్మ, 18న సమ్మక్క అమ్మవార్లు గద్దెలపైకి చేరుకుంటారని తెలిపారు. 18వ తేదీ నుంచి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా మార్గసూచీలు అన్ని దారుల్లో పెడుతున్నాం. కారు పార్కింగ్‌ స్థలం నుంచి జంపన్న వాగు వరకు మినీ బస్సులు ఏర్పాటు చేస్తాం.భక్తులు మొక్కులు చెల్లించగానే వెళ్లిపోతే వెనక ఉండే భక్తులకు ఇబ్బంది ఉండదు.తెలంగాణ కల సాకారమైనందుకు 19న సీఎం కేసీఆర్‌ వనదేవతలకు మొక్కు చెల్లిస్తారు. జాతరకు వచ్చే వారికి వరంగల్‌, లక్నవరం నుంచి హెలికాప్టర్లు అందుబాటులో ఉంచుతాం జాతర పరిసరాల్లో 4500 మరుగుదొడ్లు ఏర్పాటు చేశాం. బస్టాప్‌లు, పార్కింగ్‌ స్థలాల వద్ద పెద్ద సంఖ్యలో మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంచుతాం.ప్లాస్టిక్‌ పేపర్‌ కిందపడిన వెంటనే సిబ్బంది తొలగిస్తారు. పారిశుద్ధ్య సమస్య అనేది రానివ్వం. ఏర్పాట్లలో ఎక్కడా రాజీ పడొద్దని సీఎం ఆదేశించారు. అధిక ధరలకు వస్తువులను విక్రయించే దుకాణాలు మూసివేయిస్తాం. కార్లు రోడ్లపైన నిలపడానికి అవకాశం లేకుండా చేస్తున్నాం. పాస్‌లు ఉన్న వీఐపీలకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేస్తున్నాం. వీఐపీల కంటే సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం.