మేయర్‌గా బొంతు!.. డిప్యూటీ మేయర్‌గా ఫసియుద్దీన్!
హైదరాబాద్ ,ఫిబ్రవరి 10(జనంసాక్షి):హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెరాస మేయర్, డిప్యూటీ మేయర్ల అభ్యర్థిత్వంపై తీవ్ర కసరత్తు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ మేయర్ అభ్యర్థిత్వానికి చర్లపల్లి డివిజన్ నుంచి ఎన్నికైన బొంతు రామ్మోహన్ ముందువరుసలో ఉండగా, డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా బోరబండ కార్పొరేటర్ ఫసీయుద్దీన్ పేరు పెరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ రాత్రి లేదా గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు పేర్లను కేసీఆర్ ఓకె చేశారని.. రాత్రికి అధికారిక ప్రకటన చేస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. రేపు గ్రేటర్ కార్పొరేటర్ల సమావేశానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. రేపు ఉదయమే మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక లాంఛనప్రాయంగా పూర్తయ్యాక..బొంతు రామ్మోహన్, ఫసీయుద్దీన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బొంతు రామ్మోహన్ తెలంగా ఉద్యమంలో విశేషంగా పాల్గొనటమే కాకుండా టిఆర్‌ఎస్ బలోపేతానికి చేసిన కృషికి గుర్తింపుగా పార్టీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
రేపు జీహెచ్‌ఎంసీ టిఆర్‌ఎస్ కార్పొరేటర్ల భేటీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్నికైన టిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు శుక్రవారం (రేపు) ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, నగరానికి చెందిన మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొంటారు. రేపు ఉదయం జీహెచ్‌ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
జీహెచ్‌ఎంసీలో ఉన్న 150 డివిజన్లలో టిఆర్‌ఎస్ 99 డివిజన్లలో విజయ ఢంకా మోగించింది. చరిత్రలో ఏ పార్టీ సాధించనన్ని స్థానాల్లో విజయం సాధించింది.