మైనర్‌ బాలికకు సిజేరియన్‌: మగబిడ్డ జననం

ముంబై,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): గర్భస్రావానికి సుప్రీంకోర్టు అనుమతించిన 13 ఏళ్ల అత్యాచార బాధితురాలుకు సిజేరియన్‌ చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం ఒక మగబిడ్డకుజన్మనిచ్చింది. మైనర్‌ బాలిక 31 వారాల గర్భంతో ఉండటంతో గర్భస్రావానికి అనుమతించాలంటూ బాలిక తల్లి సుప్రీంకోర్టును ఇటీవల ఆశ్రయించింది. బాలిక వయస్సు, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు రెండ్రోజుల క్రితం గర్భస్రావానికి అనుమతి ఇచ్చింది. జేజీ ఆసుపత్రిలో ఇందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించింది. దీంతో వైద్యులు శుక్రవారంనాడు ఆ బాలికకు సిజేరియన్‌ జరిపి మగబిడ్డను బయటకు తీశారు. నవజాత శిశువు బరువు 1.8 కేజీలు ఉండటంతో నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఎన్‌ఐసీయూ)లో ఉంచారు. ‘శిశువు పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు నిరంతరం పర్వవేక్షిస్తున్నారు. నెలలు నిండకుండానే ప్రసవం కావడంతో శిశువు బరువు తక్కువగా ఉంది’ అని గైనకాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ అశోక్‌ ఆనంద్‌ తెలిపారు. కాగా, శిశువు తల్లి (మైనర్‌ బాలిక)ని కూడా మరో వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచుతామని చెప్పారు. కాగా, ఆపరేషన్‌ అనంతరం తన కుమార్తె క్షేమంగానే ఉన్నందని, తనతో మాట్లాడిందని ఆమె తల్లి తెలిపింది. నవజాత శిశువును తమతో ఉంచుకోవాలా వద్దా అనేది ఇంకా తాము నిర్ణయించుకోలేదని, తన భర్తే దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటాడని చెప్పింది. కాగా, శిశువును వద్దనుకునే నిర్ణయానికి బాలిక తల్లిదండ్రులు వస్తే తామే దత్తత తీసుకుంటామని డాక్టర్‌ ఆనంద్‌ తెలిపారు.