మైనర్ బాలికపై యువకుడి కిరాతకం
ఆరు నెలలుగా అత్యాచారం..వీడియో చిత్రీకరణ
స్నేహితులకు వాట్సాప్ ద్వారా వెల్లడి
గుర్తించిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు
రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు
నిజామాబాద్,జూన్23(జనం సాక్షి): నిజామాబాద్ జిల్లాలో బాలికపై అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ బాలికపై గత ఆరునెలలుగాఅత్యాచారం చేస్తూ..వాటిని సెల్‌ఫోన్లో చిత్రీకరించి, స్నేషితులకు వాట్సాప్ చేసి ఆనందించిన కుర్రాడి పైశాచికం బయటపడింది. లోలోన కుములుతూ అతని పైశాచికి బలయిన బాలిక ఇన్నాళ్లూ ఘటనను పెదవి కిందే దాచుకుంది. వ్యవహారం తండ్రికి తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఓ బాలుడు కిరాతకానికి ఒడిగట్టాడు. బాలికను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేస్తూ సెల్ఫీ వీడియోలు తీశాడు. ఆపై వాట్సాప్‌లో స్నేహితులకు ఆ వీడియోను షేర్ చేశాడు. చిత్రాలు, వీడియోలతో బెదిరింపులకు గురిచేసి ఆరు నెలలుగా ఈ అఘాయిత్యానికి ఒడిగడుతున్న తీరును తెలుసుకున్నారు. శుక్రవారం రాత్రి బాలిక తండ్రికి అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విషయం పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. నిజామాబాద్ నగర సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన పదో తరగతి బాలిక (15)కు ఆమె ఇంటి పక్కనే ఉండే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తయిన విద్యార్థి (17)తో స్నేహం ఏర్పడింది. ఆరు నెలల కిందట బాలిక పుట్టినరోజు కాగా.. బాలుడు తన స్నేహితులతో కలిసి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో కేక్ కట్ చేసి తిరిగి ఇంటి దగ్గర దింపారు. ఆ సమయంలో తీసుకొన్న చిత్రాలు, వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇంటి పక్కనే ఉంటుండటంతో బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో తరుచూ వెళ్లి లొంగదీసుకొనేందుకు ప్రయత్నించేవాడు. చిత్రాలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసేవాడు.తప్పనిసరి పరిస్థితుల్లో బాలిక అతడి బెదిరింపులకు లొంగిపోయింది. తదనంతరం బాలికతో కలిసి సెల్ఫీ చిత్రాలు తీసుకొని తన స్నేహితులకు షేర్ చేశాడు. ఏప్రిల్ 25న బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియోని తీశాడు. ఆ వీడియోను కూడా స్నేహితులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు. బాలిక తండ్రి మొబైల్ ఫోన్ ఈ మధ్య చోరీకి గురైంది. దీంతో ఇంట్లో ఉన్న మరో ఫోన్‌ను వాడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం ఈ నంబర్‌కు సదరు బాలుడు పలుమార్లు ఫోన్ చేశాడు. బాలిక తండ్రికి అనుమానం వచ్చి ఆరా తీయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాలుడిని పిలిపించి హెచ్చరించాడు. మొబైల్ ఫోన్ తీసుకొని అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు తొలగించాలని సూచించారు. అయితే, ఆ బాలుడు అందుకు ఒప్పుకోలేదు. అతడి నుంచి ఆ ఫోన్‌ను తీసుకుని, ఓ దుకాణానికి తీసుకెళ్లి అన్‌లాక్ చేయించగా, అందులోని చిత్రాలు, వీడియోలను చూసిన కుటుంబీకులు కంటతడి పెట్టుకున్నారు. జరిగిన ఘటనపై బాలిక తండ్రి శుక్రవారం అర్ధరాత్రి 4వ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలుడి సెల్‌ఫోన్‌లో లభ్యమైన చిత్రాలు, వీడియోలను పోలీసులకు అందజేశారు. ఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు బాలుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. బాలికను సంరక్షణ నిమిత్తం స్వధార్ గృహానికి తరలించినట్లు సీఐ వెల్లడించారు.