మైనార్టీ కమీషన్ గుర్తింపుతోనే ప్రభుత్వ నిధులు
మైనార్టీ సంస్థలు వాణిజ్య ధోరణులు విడనాడాలి
పేదమైనార్టీలకు విద్యా బుద్దుల కల్పనకు దోహదం
జాతీయ మైనార్టీ విద్యాకమీషన్ సభ్యులు జాఫర్ ఆఘా
కరీంనగర్, అక్టోబర్ 10(జనంసాక్షి): జాతీయ మైనార్టీ విద్యా కమీషన్ గుర్తింపు వుండే సంస్థలకు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థికపరమైన నిధులు అందుతాయని ఆ దిశగా ప్రమాణాలు పాటించాలని జాతీయ మైనార్టీ విద్యా కమీషన్ సభ్యులు జాఫర్ ఆఘా అన్నారు. శనివారం క్రిసెంట్ ఎడ్యూకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసిన ” భారతదేశంలో అల్పసంఖ్యాకులు హక్కులు సవాళ్ళు ” సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ సంస్థలు వాణిజ్యపరమైన ధోరణులు విడనాడాలని పేదల కోసం విద్యావ్యాప్తి చేయాలని ఆ దిశగానే ఆలోచించాలని సూచించారు. పేదలకు కాకుండా కొన్ని వృత్తి కోర్సు సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీలకు విద్యాబుద్దులు కల్పించేందుకు అనువైన ప్రమాణాలు పాటించాలని అలా వుంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయని అదే విధంగా మానవ వనరుల అభివృద్ది శాఖ కూడా వక్ఫ్‌బోర్డు నుంచి కూడా నిధులు అందుతాయని అన్నారు. జాతీయ మైనార్టీ జుడిషియల్ చైర్మన్ ఢిల్లీ హైకోర్టు జడ్జీ వుంటారని తెలిపారు. న్యాయపరమైన చిక్కులు వుంటే వారిని కలవొచ్చని అన్నారు. ముస్లిం ఎద్యూకేషన్ సొసైటీ నిర్వహకులు షేక్ అబుబాకర్ మాట్లాడుతూ దేశంలో అల్పసంఖ్యకులకు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక పథకాలపై అవగాహన పెంచాలని సూచించారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఒక పెట్టుబడి వ్యయంగానే భావించాలని దీని వల్ల దీర్ఘకాలికంగా లాభాలు వుంటాయని అన్నారు. స్వచ్చంద సంస్థలు ముఖ్యంగా క్రిసెంట్ ఎడ్యూకేషనల్ సొసైటీ చేపట్టిన కార్యక్రమాలు ఎంతగానో అల్పసంఖ్యాకుల అభ్యున్నతికి దోహదం చేస్తున్నాయని చెప్పారు. క్రిసెంట్ సొసైటీ అద్యక్షుడు సయిద్ వజాతుల్లా అయజ్ మాట్లాడుతూ భావదారిద్య్రం వదులు కొంటే అల్ససంఖ్యాకులు పేదరికం నుంచి బయట పడుతారని అన్నారు. కార్యదర్శి ఎంఏ నయిమోద్దిన్ మాట్లాడుతూ 12శాతం రిజర్వేషన్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాజిద్‌ఫక్రూజమాఖాన్ అహ్మద్ అబ్దుల్ అజీమ్, ఎంఏ రఖీబ్ హమీద్ లతీఫ్ తదితరులు పాల్గొని గత ఇరువై ఏళ్ళుగా సంస్థ చేపట్టిన కార్యక్రమాలు వివరించారు.