మొండిబకాయిల వసూళ్లలో కానారని చిత్తశుద్ది

ఎగవేత దారుల్లో రాజకీయ నేతలు

కఠిన నిబంధనలతోనే దీనికి పరిష్కారం

ముంబై,నవంబర్‌1(జ‌నంసాక్షి): రఘురామ్‌ రాజన్‌ ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నప్పుడే బ్యాంకుల అసెట్‌ క్వాలిటీపై సవిూక్షలు ప్రారంభించారు. మొండిబకాయిల ప్రక్షాళనకు శ్రీకారంచుట్టాల్సిందిగా బ్యాంకులను హెచ్చరించారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మొండిపద్దులు బ్యాంకుల మొడకు గుదిబండగానే ఉంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తీవ్ర చర్యలు అనివార్యమయ్యాయి. నిజానికి బ్యాంకింగ్‌ చట్టంలో ఇన్నాళ్లూ ఈ అంక్షలన్నీ ఉన్నా బ్యాంకర్ల కక్కుర్తి, నిర్లక్ష్యం కారణంగానే సామాన్యుల డబ్బును పలుకుబడి ఉన్న వారికి దోచి పెట్టారు. విజయ్‌ మాల్యా లాంటి వారు ఆస్తుల కూడబెట్టుకుని వేలాది కోట్లు ఎగవేసి విదేశాల్లో జల్సాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్‌ 35ఎకు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ చట్టంతో మొండి బకాయిల వసూలుకు చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యల విషయంలో బ్యాంకులకు నిర్ణయాధికారం పెరుగుతుంది. ఆర్‌బిఐకి కూడా పూర్తిస్థాయిలో అధికారాలు దక్కుతాయని భావించారు. మొండిపద్దుల అంతు చూసేందుకు ప్రభుత్వం కొత్త చట్టంతో ఆర్‌బిఐ మరింత పదను కలిగి ఉంటుంది. మొండిబకాయిలుగా మారిన రుణాలను గుర్తించి తక్షణమే వాటి వసూలు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ రూపొందిం

చేందుకు ఆర్‌బిఐకి ప్రభుత్వం తగిన అధికారాలు కట్టబెట్టింది. బ్యాంకింగ్‌ చట్టాల సవరణ ఆర్డినెన్స్‌ వల్ల ఆర్‌బిఐకి విస్తృత అధికారాలు లభిస్తాయి. కొన్ని మొండిపద్దులను ఆర్‌బిఐ ఇప్పటికే గుర్తించి జాబితా తయారు చేసింది. ఇక వాటి విషయంలో చర్యలకు ఉపక్రమిస్తుందని ఆర్థికమంత్రి జైట్లీ చెప్పారు. తాజాగా రాష్ట్రపతి ఆమోదించిన ఆర్డినెన్స్‌ ప్రకారం ఇక మొండి బకాయిలను కూడా వసూలు చేసే కఠినచట్టం తెచ్చారు. ఆస్తులను స్వాధీనం చేసుకోవడం మొదలు కఠిన చర్యలకు ఉపక్రమించేలా దీనిని రూపొందించామని ఆర్థికమంత్రి ఆర్డినెన్స్‌ తీసుకుని వచ్చిన సమయంలో అరుణ్‌ జైట్లీ చెప్పుకొచ్చారు. కొత్తగా చట్టం తీసుకుని వచ్చిన దరిమిలా బాకీలు వసూలు చేయడం అటుంచితే ఇందుకు బాధ్యులైన బ్యాంకర్లను ముందుగా శిక్షించాలి. ఏయే బ్యాంకులో నిరర్థక ఆస్తులు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి అందుకు కారకులు ఎవరో నిలదీయాలి. బ్యాంకర్లను వదిలి కేవలం చట్టం అమలు చేస్తామంటే కుదరదు. సామాన్యులపై చూపిన కాఠిన్యం పెద్దలపై ఎందుకు చూపలేదో నిలదీయాలి. పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చి వాటిని వసూలు చేసుకోలేక పోయిన బ్యాంక్‌ అధికారులకు జరిమానా,శిక్షపడేలా చేయాలి. అప్పుడే ఇలాంటి వైఫల్యాలు కనిపించవు. అయితే బ్యాంకింగ్‌ రంగానికి శాపంగా పరిణమించిన మొండిపద్దుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఆర్‌బిఐకి పూర్తి అధికారాలు కట్టబెడుతూ చట్టసవరణ చేయడాన్ని స్వాగతించాల్సిందే. భవిష్యత్‌లో అయినా ఇలాంటి ఉపద్రవాలు రాకుండా చూసుకోవాలి. మొండిపద్దులను ఖాతాల్లోంచి పక్కకు తప్పించడానికి బ్యాంకులు, ఏదో రకంగా సెటిల్‌చేసుకోవడానికి ఎగవేతదారులూ సిద్ధంగా లేకపోవడంతో పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. కొంతకాలంగా దేశీయ బ్యాంకులకు మొండి బాకీలు భరించలేని స్థాయికి పెరిగిపోయాయి. రుణాల్ని ఎగ్గొట్టే వారిలో ఎక్కువమంది బడా కార్పొరేట్లే. బడుగు జీవుల నుంచి ముక్కుపిండి అప్పులు వసూలుచేసే బ్యాంకులు కార్పొరేట్ల విషయంలో విూనమేషాలు లెక్కిస్తూ వచ్చాయి. దీంతో మొండి బాకీల సమస్య జటిలంగా మారింది. దీనివల్ల కేవలం బ్యాంకింగ్‌ రంగానికే కాకుండా, దేశ ఆర్ధికవ్యవస్థకు కూడా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దీంతో ఏదోవిధంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని అటు ఆర్‌బీఐ, ఇటు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసి కఠిన చట్టానికి శ్రీకారం చుట్టాయి. బ్యాంకింగ్‌ రంగంలో సుమారు 7 లక్షల కోట్ల రూపాయల మేర మొండి పద్దులున్నట్టు అంచనా. బ్యాంకుల మొండిపద్దుల సమస్య పరిష్కారానికి ఆర్‌బిఐకి అదనపు అధికారాలు అవసరమైనందునే ఆర్డినెన్స్‌ తెస్తున్నట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. ఇకపై రుణాల విక్రయం, లాభదాయకంగా లేని శాఖల మూసివేత, నిర్వహణ వ్యయం, ఓవర్‌హెడ్స్‌ తగ్గింపు.. వంటి పలు చర్యల విషయంలో బ్యాంకులకు ఆర్‌బిఐ ఆదేశాలు ఇవ్వగలుగుతుంది. మొండిపద్దుల వసూలుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వలేదు. ఈ పరిస్థితిని అధిగమించి క్రియాశీలంగా ముందుకు పోయేందుకు వీలు ఏర్పడింది. ఇందులో భాగంగా ఆర్‌బిఐ తొలిదశలో 60 మంది బడా ఎగవేతదారులపై దృష్టి సారిస్తుంది. రుణాల ఎగవేతకు సంబంధించిన ఈ 60 బడా కేసులను పరిష్కరిస్తే ఎగవేతదారులకు పరిస్థితుల తీవ్రత బోధపడుతుంది. రుణాల ఎగవేతకు పాల్పడినవారికి బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడాన్ని కూడా ఆర్‌బిఐ నిషేధిస్తుంది. సాధ్యమైనంత గరిష్ఠస్థాయిలో బకాయి సొమ్ము వసూలు చేసుకునేందుకు వీలుగా తగిన నిర్ణయాలు బ్యాంకర్లు తీసుకోగలుగుతారు. ఇప్పుడున్న మార్గదర్శకాలను సడలించి కొత్త పద్ధతిలో బకాయిలు వసూలు చేసుకునే అవకాశం బ్యాంకులకు ఉంటుంది.