మొక్కలు నాటడం తప్పనిసరి కావాలి: డిఆర్‌డివో పిడి
కామారెడ్డి,జూలై28(జనం సాక్షి): ఈ సంవత్సరం హరితహారంలో భాగంగా జిల్లాకు కోటీ 32 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా నిర్ణయించామని డీఆర్డీవో పిడి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మొక్కలతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని, ప్రతిఒక్కరూ హరితహారం కార్యక్రమంలో భాగస్వాములై పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రతీ క్షేత్ర సహాయకుడు ఉద్యమంలా పనిచేసి నెలాఖరు వరకు లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. మొక్కలు నాటడంలో అశ్రద్ధ వహించవద్దన్నారు. మొక్కల సంరక్షణకు వాచర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ వాచర్ 400 నుంచి వెయ్యి మొక్కలను నాటి వాటికి కంచె వేసి వారానికి ఒకసారి నీళ్లు పోయాలన్నారు. వాచర్‌కు ప్రతినెలా మొక్కకు 5 రూపాయలను ఇవ్వనున్నట్లు చెప్పారు. వాచర్ల పనితీరును గమనించడానికి ప్రతీ నలుగురు వాచర్‌లపై ఒక సూపర్‌వైజర్‌ను ఏర్పాటుచేసి పనులను పర్యవేక్షిస్తారని అన్నారు. విద్యార్థులతో కూడా మొక్కలు నాటి వాటి ప్రాధాన్యతను గుర్తించాలని వివరించారు. ప్రజలు భాగస్వామ్యమై విజయవంతం చేయాలన్నారు. మానవాళి మనుగడలో చెట్ల ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సారి కోటీ 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు మొక్కల ప్రాధాన్యత వివరించి ఇంటి ఆవరణల్లో సైతం మొక్కలు నాటేలా చూడాలన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించి వాటి సంరక్షణను ఉపాధ్యాయులు పర్యవేక్షించాలన్నారు. మంచి వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు.