మొక్కలు నాటని వారు ఇప్పుడైనా నాటండి

నాటిన వారు వాటిని సంరక్షించండి

హరితహారం సక్సెస్‌ అవుతోందన్న జోగు రామన్న

కంటివెలుగును కూడా ఉపయోగించుకోవాలని సూచన

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): ఆలస్యంగా అయినా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మానవ మనుగడ కొనసాగుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నారు. ఇప్పటికే నాటిన వారు వాటిని సంరక్షించాలని, కొత్తగా నాటనివారు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది మన పిల్లలకు అందించే బ్యాంక్‌ బ్యాలెన్స్‌ లాంటిదని గుర్తుంచుకోవాలన్నారు. గురువారం నాడాయన హరితహారంపై ఆరా తీసారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పానికి ప్రజలందరూ ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తమ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 15.50 కోట్ల మొక్కలు నాటించామన్నారు. ఇంటి వద్ద పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మొక్కలు నాటి పర్యవరణాన్ని పరిరక్షించుకొని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలు నెలల తరబడిబయటకు వెళ్లని పరిస్థితులు నెలకొంటాయని రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలకు కూడా అదే పరిస్థితి రావద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.అటవీ సంపదను పెంపొందించడంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఖాళీ స్థలాల్లో తప్పని సరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అవసరమైనన్ని మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని ఒక వేళ కొరత ఏర్పడితే ప్రత్యేక నిధులను కేటాయించి మొక్కలను కొనుగోలు చేసి సరఫరా చేస్తామన్నారు.నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో ఆదిలాబాద్‌ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యం పెట్టుకున్నామని.. ఇప్పటి వరకు 48లక్షల మొక్కలు నాటామన్నారు. రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలోనే ఉందన్నారు. వంద శాతం మొక్కలను నాటి త్వరగా జిల్లాను మొదటి స్థానంలోకి తీసుకురావాలన్నారు. మహనీయుల పేరిట మొక్కలు నాటించాలన్నారు.

పుట్టిన రోజు, పెళ్లి రోజులు, స్మారక దినోత్సవాలు, జయంతులు, వర్ధంతులు, మహనీయుల పేర్లతో మొక్కలు నాటితే విద్యార్థుల జ్ఞాపకశక్తి పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రాంబించారని అన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతగా పని చేసి విజయవంతం చేయాలని రామన్న అన్నారు. అధికారులు బాధ్యతగా పని చేస్తేనే అది విజయవంతం అవుతుందన్నారు. ప్రభుత్వం కంటి వెలుగు అనే గొప్ప కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ఆశకార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కంటి చూపు సమస్యలపై వివరించి వైద్య శిబిరానికి వచ్చేలా చూడాలన్నారు.