మొక్కలు నాటే బాధ్యతను గుర్తించాలి

ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్న మంత్రులు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని మంత్రులు పిలుపినిచ్చారు. ఈ బాధ్యతను ప్రి ఒక్కరూ తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, జోగు రామన్నలు అన్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్‌ చెరువు కట్టపై ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడవులను చెట్లను కాపాడుకున్నప్పుడే సకాలంలో వర్షాలు కురుస్తాయని అన్నారు. చెరువు గట్లపై ఈత మొక్కలు నాటితే గీత కార్మికుల వృత్తిని కాపాడినట్లు అవుతుందని ప్రభుత్వం ఆబ్కారీ శాఖ ద్వారా ఈ మొక్కలు నాటించడం జరుగుతుందని వివరించారు. అడవులు అంతరిస్తుండటంతో అక్కడ ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో గ్రామ శివార్లలో పండ్ల చెట్లను పెంచితే కోతులను మళ్లీ అడవికి పంపవచ్చని పేర్కొన్నారు. అనంతరం నిర్మల్‌ పట్టణంలోని జీకే ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ’ విభాగాన్ని ప్రారంభించారు. ఇకపోతే నాలుగో విడత హరిత హారంలో భాగంగా ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులోమంత్రి జోగురామన్న మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ప్రాణమున్న ప్రతి జీవ రాశి కోసమే ఈ హరితహారం కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కార్యక్రమమని వివరించారు. ఆదిలాబాద్‌ పట్టణంలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ ఛైర్మన్‌ రాజన్న, పురపాలక ఛైర్మన్‌ మనీషా, ఐసీడీఎస్‌ ప్రేమల, మున్సిపల్‌ కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.