మోడీకి దడ పుట్టిస్తున్న కౌగిళిమోడీకి దడ పుట్టిస్తున్న కౌగిళి
– ఏకమవుతున్న కాంగ్రెస్, బహుజన, వామపక్ష, ప్రాంతీయ పార్టీలు
న్యూఢిల్లీ,మే 28(జనంసాక్షి):బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ అన్నాడు శతకకర్త. కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఇదే విషయాన్ని రూఢి చేస్తున్నది. దేశంలో బీజేపీకి తిరుగేలేదనుకున్న ఆశలను గండికొట్టింది. భాజాపాయేతర పార్టీలు ఒకే వేదిక మీదికి రావడంతో ఇక బీజేపీ ఆటలు సాగవనే సంకేతం అందింది. ఇదంతా ఒక ఎత్తైతే కాంగ్రేస్ అధినేత్రి సోనియా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒకరినొకరు కౌగిళించుకోవడం మోడీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడన్న రాజకీయ ఎత్తుగడ ఈ వేదిక మీద కనిపించింది. సోనియా మాయావతిల కౌగిళింత మోడీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నది. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి భారీ సంఖ్యలో హజరైన వివిధ రాజకీయ పార్టీల నేతలు ఒకే వేదిక మీద జతకట్టారు. అదే సమయంలో సోనియాగాంధీ మాయావతిని ఆలింగనం చేసుకున్నారు. ఆ ఆలింగనానికి యావత్ దేశానికి 2019లో జట్టు కట్టబోతున్న తీరుకు ఇదొక సంకేతంగా మారింది. దీంతో ఇప్పుడు ఈ కౌగిళింత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఉత్తరాదిలో చక్రం తిప్పి దక్షిణాదిని సైతం ఆక్రమించుకుంటామన్న కాషాయ శ్రేణులకు ఈ కౌగిళింత ఒక అడ్డుకట్టలా పరిణమించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి ఇదొక పీడకలగా వెంటాడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వాత మిత్రులు ఉండరనేది నిజం. కానీ, కర్ణాటక ఎన్నికల్లో చావుదెబ్బ తిని అధికారిన్ని అందుకోలేకపోయిన తరుణంలో ఇట్లా మాయావతి, సోనియాగాంధీలు ఒకరినొకరు కౌగిళించుకోవడం ఇప్పుడు బాజాపాకు పెనుగండంగా మారింది.
కౌగిళింతకు ముందు ఏం జరిగింది…?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ ఆధిక్యతను సాధించింది. దీంతో అక్కడి సీఎం ఆదిత్యనాథ్ కూడా మోడీలాగే విర్రవీగాడు. అలాంటి సమయంలో గోరాఖ్‌పూర్ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ప్రధాన ఎన్నికల్లో అపజయాన్ని చవిచూసిన ప్రతిపక్ష పార్టీలకు బీజేపీని ఓడించడమే ఏకైక ఎజెండాగా మారింది. దీంతో పోటీ బాజాపాకు, బాజాపాయేతర పార్టీలకు మధ్యగా హోరాహోరీగా మారింది. ఆ సమయంలోనే ఈ కౌగిళింతకు బీజం పడింది. కాంగ్రెస్, బీఎస్పీ కలిసి బీజేపీకి చుక్కలు చూపించి ఓడించారు. అట్లా కాషాయ శక్తులకు చెక్ పెట్టడానికి ఒక ఐక్య సంఘటన తాత్కాలికంగానైనా విజయం సాధించింది. ఈ అనుభవాన్ని మరోసారి కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో గుర్తు చేసుకున్నారు. వాగ్ధానాలతో ఓట్లకు గాలమేస్తున్న బాజాపాకు అధికారం దక్కకుండా ఉండడం కోసం ఐక్యకూటమి ఏర్పడాల్సిన చారిత్రిక అవసరాన్ని కాంగ్రెస్, బీఎస్పీ శ్రేణులు గుర్తించారు. నిజానికి కర్ణాటకలో ఒంటరిగానే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఒక వేళ అది వీలుకాకుంటే జేడీఎస్‌తో పొత్తుకైనా సిద్ధపడి, బీజేపీకి అధికారం దక్కకుండా చేయ్యాలని స్కెచ్ గీశారు. ఇదే సమయంలో జాతీయ పార్టీగా ఉన్న బీఎస్పీ కూడా ఈ కూటమికి చేరువయ్యింది. ఎన్నికలకు ముందే మాయవతి తన మద్ధతను ప్రకటించింది. ఇట్లా మ్యాజిక్ ఫిగర్‌కు సరిపోయేటన్ని సీట్లు రాకపోయినా భాజాపాయేతర పార్టీలు అధికారాన్ని దక్కించుకున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్నా సరే యెడ్యూరప్ప వర్గం మాత్రం కుర్చీని అందుకోలేక కుదేలైంది. యూపీ గోరాక్‌పూర్ ఉప ఎన్నిక తర్వాత తమ ఐక్యత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల కలలను కల్లలు చేసిందనే ఆనందంతో సోనియాగాంధీ తన ఆనందన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతితో పంచుకున్నారు. ఇదీ కౌగిలింత వెనుక దాగిన మతలబు!
2019లో కౌగిలి పట్టు బిగిసేనా?!
కర్ణాటక ఎన్నికలు ఎంత ఉత్కంఠతను రేపినా, 2019 ఎన్నికలకు ఒక రెఫరెండంగా నిలిచాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరాదిలో పలు రాష్ట్రాలను గెలుచుకున్న భాజాపా అదే రీతిలో దక్షిణాదిన కూడా తన జైత్రయాత్రను కొనసాగించాలని భావించింది. కానీ, అదంత సులభం కాదని భాజాపాయేతర పార్టీలు రుజువు చేశాయి. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కూటమిగా ఏర్పడ్డాయి. ఇది బీజేపీకి మింగుడు పడని విషయంగా మారింది. ఇక ఇదే సమయంలో సోనియా మాయాల కౌగిలి 2019ఎన్నికల పొత్తును కూడా సంకేతిస్తున్నాయి. మరోసారి ఈ దేశం బీజేపీ కబంధ హస్తాల్లోకి వెళ్లకుండా చూడాలంటే మనమంతా ఒక్కటి కావాలని కౌగిలి మిత్రులు అంతర్గత ఒప్పందమేదో చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక సెక్యులర్ శక్తులకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. అధికారాన్ని చేజిక్కుంచుకున్న బీజేపీ తనకు ఇక ఎదురే లేదన్నట్టు ప్రవర్తించింది. కానీ, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కమలనాథులకు అధికారం అంత ఈజీ కాదని ఒకే ఒక్క కౌగిలింత తేల్చిపడేసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మోడీకి తగ్గి రాహుల్‌కు పెరుగుతున్న ఆదరణ!
దేశం వెలిగిపోతుందన్న మోడీకి ఆదరణ రోజు రోజుకు తగ్గిపోతున్నదని లోక్ నీతి చేసిన సర్వే చెబుతున్నది. గత మాసం ఏప్రిల్ 20 నుండి మే 17వరకు 19 రాష్ట్రాల్లో 15వేల మంది మీద లోక్ నీతి ”మూడ్ ఆఫ్‌నేషన్” పేరిట సర్వే చేసింది. ఈ సర్వేలో వచ్చిన అభిప్రాయాల ప్రకారం రాజస్థాన్‌లో 5శాతం, మధ్య ప్రదేశ్‌లో 15శాతం ఎక్కువ పాయింట్లతో బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీ ముందుందని సర్వే పేర్కొంది. అంతేకాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మోడీకి సమాన స్థాయిలో 43శాతం అభిమానులను సంపాదించుకోగలిగారని లోక్‌నీతి సర్వే పేర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పవర్ దక్కడం అంత సులభం ఏమీ కాదని, అందుకోసం రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ మరింత శ్రమించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
మోడీకి దూరమవుతున్న మధ్యతరగతి!
ప్రధాని నరేంద్రమోడీ గడిచిన నాలుగేండ్ల పాలన పట్ల క్రమంగా మధ్యతరగతి వ్యతిరేకత పెరిగిపోతున్నది. నోట్ల రద్దు వంటి నిర్ణయాలు నల్లధనం కలిగిన కుబేరులను ఏమీ చేయలేకపోగా,మధ్యతరగతి ప్రజానీకాన్నితీవ్ర ఇక్కట్ల చేసింది. దీంతో మరోసారి మోడీకి అధికారం కట్టబెట్టడం మాట అటుంచి, కనీసం బీజేపీ గురించి ఆలోచించడానికే మధ్యతరగతి వణికిపోతున్నదని సర్వేలు చెబుతున్నాయి. మరి వచ్చే యేడాది నాటికి మోడీగాలి మసకబారుతుందా? అనేది కాలం తేల్చాల్సిన విషయం. ఇప్పటికే దళితులు, మైనారిటీలు బీజేపీకి దూరమయ్యారు. ఇక బీసీలు, అగ్రవర్ణాల్లోని సగం ప్రజానీకంది కూడా ఇదే దారి అని లోక్‌నీతి సర్వే చెబుతోంది.