మోడీ నాయకత్వంపై ప్రజల్లో తొలగుతున్న భ్రమలు
మోడీ హవా తగ్గుతుందన్న సర్వేలు లేదా అంచనాలు చూస్తుంటే బిజెపి ప్రభ ఎంతగా దిగజారిందో కమల నాధులు సవిూక్షించుకోవాలి. బిజెపిని ఓ ఆదర్శవంతమైన పార్టీగా,ప్రజలకు మేలుచేసే పార్టీగా తీర్చిదిద్దిన పెద్దలను విస్మరించి ఏకఛత్రాధిపత్యం వహించడం కారణంగా దాని ప్రభ మసకబారింది. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న వేళ ఎన్‌డిఎ కూటమికి బొటాబొటి మెజార్టీ వస్తే మోడీని నేతగా అంగీకరిస్తారా అన్నది అనుమానమే. ఎన్‌డిఎ కూటమి ఇప్పటికే బలహీనపడింది. ఒక్కోపార్టీ బయటకు వచ్చేస్తోంది. టిడిపి, శివసేన ఇప్పటికే బయటపడ్డాయి. బిజెపిలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది. దీంతో మోడీతో జతకట్టే పార్టీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరోవైపు ప్రాంతీయ పార్టీలన్నీ మళ్లీ ఏకమవుతున్న వేళ ప్రధాని మోదీ ప్రభ మసకబారుతున్నదన్న సర్వే క లవరపెడుతోంది. మున్ముందు కమలనాథులకు కష్టకాలమే అన్న అంచనాలు మొదలయ్యాయి. 2019లో పగ్గాలు చేపట్టి రెండోసారి అధికార పీఠం ఎక్కాలని కలలు కంటున్న నరేంద్ర మోడికి విపక్షాల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదన్న గట్టి సంకేతాలు మొదలయ్యాయి. కేంద్రంపై జనంలో వ్యతిరేకత రోజురోజుకి పెరిగి బీజేపీ పుట్టిముంచనున్నదన్న వార్తలు అసలుసిసలు కమలనాథులను కలవరపెడుతోంది. అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి పెద్దలకు తమ కళ్లముందే పార్టీ పతనం కావడం జీర్ణించుకోలేని విషయం కానుంది. ఇప్పటికే వారు మౌనం వహిస్తున్నారు. మోడీ ప్రభ మసకబారుతోందన్న అంచనాలకు తాజాగా వెలువడిన సీఎస్‌డీఎస్-లోక్‌నీతి సర్వే స్పష్టమైన సమాధానా లిస్తున్నది. మోదీ ప్రజాకర్షకశక్తి క్రమంగా మసకబారుతుండగా అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బలమైన నేతగా ఎదుగుతున్నారని సర్వే తెలిపింది. బీజేపీకి రెండోసారి అధికార మిచ్చేందుకు దేశ ప్రజలు సిద్దం గా లేరు. 47 శాతం మంది కమలనాథులకు మళ్లీ పగ్గాలు ఇవ్వొద్దని కుండబద్దలు కొట్టగా, 39 శాతం మంది రెండోసారి అధికారం ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మోదీకి ఓటేస్తామని 32 శాతం మంది చెప్పగా, ఈ ఏడాది ప్రారంభంలో 34 శాతం కమలానికి మద్దతుగా మాట్లాడారు. కేవలం నాలుగు నెలల్లోనే 2 శాతం తగ్గుదల మోదీపై ప్రజల వ్యతిరేక తను సూచిస్తోందని ఏబీపీ న్యూస్-సీఎస్‌డీఎస్ సర్వే వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వే వివరాల్ని విూడియాకు విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్‌డీఏ కూటమికి 274 స్థానాలు, యూపీఏ కూటమికి 164, ఇతరులకు 105 స్థానాలు వస్తాయని సర్వే తెలిపింది. ఎన్‌డీఏకు 39 శాతం ఓట్లు, యూపీఏకు 31 శాతం, ఇతరులకు 32 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. దక్షిణాదిలోని మొత్తం 132 సీట్లలో ఎన్‌డీఏకు కేవలం 18-22 స్థానాలు, యూపీఏకు 67-75 స్థానాలు, ఇతరులకు 38-44 స్థానాలు వస్తాయని స్పష్టంచేసింది. దక్షిణాదిలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్, తమిళనాడులో డీఎంకే, కేరళలో లెఫ్ట్‌ఫ్రంట్, కర్ణాటకలో జేడీఎస్‌లను గెలుపు గుర్రాలుగా సర్వే అభివర్ణించింది. మోదీ ప్రభుత్వంపై దక్షిణాదిలో 63 శాతం మంది తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేయగా, భారతదేశంలో ఇది 40-43 శాతంగా ఉంది. దీనికితోడు కర్నాటకలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం కూడా కాంగ్రెస్‌కు కలసి వస్తోంది. రాహుల్ కూడా మోడీ హావిూలనే ప్రచారాస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికితోడు నోట్ల రద్దు, జీఎస్టీ, దళితులపై దాడులు, ముస్లింలపై అకృత్యాలు, నిత్యావసరాలు, పెట్రో ధరల పెంపు మోదీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయని సర్వే వెల్లడించింది. ఈ విషయంలో పార్టీలో అంతర్గతంగా చర్చకు ఆస్కారం లేకుండా చేశారు. అమిత్‌షా చెప్పింది వినడం, మోడీ ధర్మోపన్యాసం చేయడం మినహా చేయగలిగింది లేదు. పార్టీలో పెద్ద తలకాయలనే పక్కన పెట్టారు. దీంతో ప్రబుత్వంలో ఏం జరుగుతుందో..ప్రజలు ఏమనుకుంటున్నారో ఆత్మవిమర్శ చేసుకునే అవకాశాలు పార్టీలో లేకుండా పోయాయి. మెజార్టీ ముస్లింలు, దళితులు, గిరిజనులు, క్రిస్టియన్లు, సిక్కులు మోదీకి రెండోసారి అధికారం ఇవ్వొద్దంటూ ఈ సర్వేలో కుండబద్దలు కొట్టారు. గుజరాత్, కర్ణాటక ఎన్నికల అనంతరం రాహుల్‌లో పరిణతి పెరిగిందని, ఆయన క్రమంగా ప్రజాకర్షకనేతగా ఎదుగుతున్నారని సర్వే తెలిపింది. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే 2018 మే నెల నాటికి కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పెరుగడమే ఇందుకు నిదర్శనమని చెప్పింది. మరికొద్ది నెలల్లో జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో బిజెపికి కష్టకాలమేనని కూడా సర్వే తెలుపు తోంది. దీనికితోడు అక్కడ పాలన అధ్వాన్నంగా ఉంటోంది. ఆ రెండు రాష్ట్రాల్లో మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. మధ్యప్రదేశ్‌లో 15 శాతం పాయింట్లతో,రాజస్థాన్‌లో 5 శాతం పాయింట్లతో కాంగ్రెస్ ముందంజలో దూసుకుపోతున్నదని సర్వే పేర్కొంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగే ద్విముఖ పోరులో హస్తానికే ఎక్కువ స్థానాలు వస్తాయని స్పష్టంచేసింది. కాంగ్రెస్ కూడా ఈ రెండు రాష్ట్రాలను ఒడిసి పట్టుకునే వ్యూహాలను సిద్దం చేసింది. కారణాలు కళ్లముందు కనపడుతున్నాయి. తప్పులు కుప్పలుగా రాశిబోసినట్లుగా ఉన్నాయి. పాలనా వ్యవహరాల్లో ప్రజాస్వామికత లోపించింది. ఏకపక్ష నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మోడీ ప్రచారార్భాటాలతో ప్రజలు విసిగి పోయారు. అందుకే బిజెపిక మరోమారు పగ్గాలు అప్పగించే విషయంలో ఆలోచనలో పడ్డట్లుగా ఉంది. ప్రధానంగా నోట్ల రద్దు,జిఎస్టీ తీవ్ర ప్రభావం చూపుతోంది. సామాన్యులను కూడా రోడ్డున పడేసిన కారణంగా వీరు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఈ వ్యవహారాలనుచక్కగా ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారు. ఇకపోతే రైతుల్లో ఎన్‌డీఏ సర్కార్‌పై భ్రమలు పూర్తిగా తొలిగిపోయాయి. వారు కేంద్రంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తంచేశారు.