మోదీకి వరుణ్‌ బాణం


` మద్దతు ధరలపై చట్టం చేయాలి
` లఖింపుర్‌ ఘటనపై చర్యలు తీసుకోవాలి
` ప్రధాని మోడీకి ఎంపీ వరుణ్‌ గాంధీ లేఖ
న్యూఢల్లీి,నవంబరు 20(జనంసాక్షి):పంటలపై కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. సాగుచట్టాలను రద్దుచేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వెంటనే మద్దతు ధరలపై ప్రకటనచేయాలన్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. రైతు పంటలకు సంబంధించిన ఇతర అంశాలను కూడా తక్షణమే నిర్ణయం చేయాలని తన లేఖలో కోరారు. రైతులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న మూడు సాగు చట్టాలను ప్రధాని మోదీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆందోళన చేపడుతున్న రైతులంతా తమ ఇండ్లకు వెళ్లాలంటే తక్షణమే ప్రభుత్వం చట్టాన్ని చేయాలని ఎంపీ వరుణ్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. రైతు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆందోళనలు చేస్తూ సుమారు 700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబసభ్యులకు నష్టపరిహారంగా కోటి ఇవ్వాలని వరుణ్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. లఖింపూర్‌ ఖేరీ హింసాత్మక ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని బీజేపీ ఎంపీ వరుణ్‌ గాంధీ వ్యాఖ్యానించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి వరుణ్‌ గాంధీ లేఖ రాశారు.ఈ వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి పేరు వినిపించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో వరుణ్‌ గాంధీ కోరారు. రైతుల సమస్యలపై ప్రధాని మోదీకి రాసిన లేఖను వరుణ్‌ గాంధీ శనివారం ట్విట్టర్‌లో పంచుకున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతులపై రాజకీయ ప్రేరేపిత, తప్పుడు కేసులను రద్దు చేయాలని వరుణ్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.