మోదీని ప్రజలు విశ్వసించడం లేదు

– గుజరాత్‌ ఫలితాలపై సంతృప్తి
– ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ,డిసెంబర్‌ 19,(జనంసాక్షి):గుజరాత్‌ ఫలితాలు వెలువడిన మరుసటి రోజే కాంగ్రెస్‌ కొత్త చీఫ్‌ రాహుల్‌ గాంధీ దూకుడు పెంచారు. ఈ ఎన్నికలు బీజేపీకి చెంపపెట్టులాంటివనీ..  బీజేపీ పరిస్థితి ప్రశ్నార్థంగా మారిందంటూ వాడివేడి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాజకీయ విధానాలు ఇకపై చెల్లబోవని గుజరాత్‌ ప్రజలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు.  గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు భాజపాకు పెద్ద కుదుపులాంటివని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన తొలిసారిగా మంగళవారం విూడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో నైతిక విజయం తమదేనన్నారు. ‘గుజరాతీయులు నా పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపించారు. భాజపా నేతలు గుజరాత్‌ మోడల్‌ అని ప్రచారం చేశారు. మూడు నెలల క్రితం గుజరాత్‌ వెళ్లినపుడు భాజపా ముందు కాంగ్రెస్‌ నిలబడలేదన్నారు. కానీ ఇప్పుడు భాజపాకు గట్టి పోటీ ఇవ్వగలిగాం. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాయి’.ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ జీఎస్టీ, అభివృద్ధి గురించే మాట్లాడలేదు. కానీ ఈ విజయానికి కారణం జీఎస్టీ విధానాన్ని ప్రజలు అంగీకరించడమేనని చెబుతున్నారు’ అని రాహుల్‌ విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రదర్శన బాగుందని అన్నారు. సొంత రాష్ట్రంలో మూడు దశాబ్దాల్లో భాజపా అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించడమనేది ప్రధాని మోదీ విశ్వసనీయత ఏమిటో ప్రశ్నిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. సోమవారం వెలువడిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 77 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్‌ ఈసారి 16 స్థానాలను అదనంగా తన ఖాతాలో వేసుకుంది. సొంత ఇమేజ్‌ పెంచుకోవాలన్న ఉద్దేశంతో మోదీ పార్టీ గీతను ఎప్పుడో దాటేశారు. అయినప్పటికీ దేశ ప్రజలు ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదు… అని రాహుల్‌ పేర్కొన్నారు. మోదీ గుజరాత్‌ మోడల్‌ను ప్రజలు విశ్వసించడం లేదని తనకు అర్థమైందనీ… మార్కెటింగ్‌, ప్రచారం బాగానే ఉన్నప్పటికీ లోపలంతా డొల్లేనని ఎద్దేవా చేశారు. తమ ప్రచారంలో సంధించిన ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేకపోయారన్నారు. ప్రధాని మోదీపై  ప్రజల్లో విశ్వసనీయత కొరవడిందనడానికి  ఫలితాలే నిదర్శనమని రాహుల్‌ వ్యాఖ్యానించారు.
భావోద్వేగాలతో గెలిచారు
గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ కేవలం ‘భావోద్వేగాల ఎజెండా’తోనే గెలుపొందని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి అశోక్‌ గెహ్లాట్‌ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రచార శైలిని తప్పుపెట్టారు. ఆయన అభివృద్ధి ఎజెండాను పూర్తిగా పక్కనబెట్టి ‘భావోగ్వేగాల ఎజెండా’తోనే ప్రచారం సాగించారని అన్నారు. తాను గుజరాత్‌ పుత్రుడ్నంటూ ప్రధాని భావోద్వేగాలు రెచ్చగొట్టారని ఆరోపించారు. మంగళవారంనాడిక్కడ విూడియాతో గెహ్లాట్‌ మాట్లాడుతూ, రాహుల్‌ గాంధీ అభివృద్ధి ఎజెండాతో దూసుకెళ్లినా అది పక్కదారి పట్టిందన్నారు. కాంగ్రెస్‌ ఓటమికి మణిశంకర్‌ అయ్యర్‌ వ్యాఖ్యలు కారణంగా భావిస్తున్నారా అని అడిగినప్పుడు ‘అవును. కాంగ్రెస్‌ వెనుకబాట పట్టడానికి కారణమైంది’ అని సమాధానమిచ్చారు. మణిశంకర్‌ ప్రకటన పార్టీకి చెరుపు చేసిందని, జరిగిన నష్టం భర్తీకి తాము ప్రయత్నం చేశామని చెప్పారు. ఆయన (అయ్యర్‌) అలా అనకుండా ఉండాల్సిందని గెహ్లాట్‌ నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. కులం అనే పదాన్ని ఆయన జడించకుండా ఉండాల్సిందని గెహ్లాట్‌ అన్నారు.