మోదీ ఎజెండాలో రైతులు లేరు – రాహుల్‌ ఫైర్‌

ముంబై,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):  దేశంలో రైతుల గోడు వినే నాథుడే లేకుండా పోయాడని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దేశంలో రైతు ఆత్యహత్యలు చోటుచేసుకోని రాష్ట్రమే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క మహారాష్ట్రలోనే గత మూడేళ్లలో సుమారు 9వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో శుక్రవారంనాడు జరిగిన ఓ బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడుతూ, రైతుల ఆత్మహత్యలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఇండియాకు పారిశ్రామికవేత్తల అవసరం ఎంతుందో రైతుల అవసరం కూడా అంతేనన్న విషయాన్ని పాలకులు గుర్తించాలని అన్నారు. రైతు సంక్షేమంపై మాటలు కట్టిపెట్టి కార్యాచరణకు దిగాలని అన్నారు. రైతుకు దేశం, రాష్టాల్రు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం ద్వారా ఎంత వస్తోందని ఏ రైతుని అడిగినా కనీస మద్దతు ధర పెంచకుండా, వర్షాలు లేకుండా, పరిహారం, బోనస్‌ వంటివి ఇవ్వకుండా మేము పని చేయలేమనే చెబుతున్నారు. నేటి భారతంలో చోటుచేసుకుంటున్న పచ్చి నిజం ఇది’ అని రాహుల్‌ అన్నారు. రక్తం చమటగా మార్చి పంట పండిస్తున్న రైతు కేవలం తమ పంటకు కనీస ధర అడుగుతున్నాడని చెప్పారు. కేంద్రంలోని అధికార ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాహుల్‌ తప్పుపడుతూ, గుజరాత్‌కు తాను ఇటీవల వెళ్లినప్పుడు సూటూబూటు ప్రభుత్వమే రాజ్యమేలుతోందని, రైతులను పట్టించుకున్న పాపాన పోవడం లేదని ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నట్టు చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు రైతు ఉపశమన చర్యలు చేపట్టారని అన్నారు. మహారాష్ట్రలో పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తీసుకువచ్చిన ఒత్తిడి వల్లే రైతు రుణాల మాఫీని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని రాహుల్‌ పేర్కొన్నారు.