మోదీ ఏడాది పాలనకు జీరో మార్క్‌లు
రైతులంటే ఆయనకు నిర్లక్ష్యం
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
అమేఠీ, మే18(ఆర్‌ఎన్‌ఎ): మోదీ ఏడాది పాలనకు జాతి జీరో మార్కులేసిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. విదేశీ పర్యటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీరిక లేకుండా ఉన్నారని, సొంత దేశాన్ని.. ఇక్కడ రైతులను పట్టించుకునే సమయం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఆయనకు దేశ ప్రజలకన్నా విదేశీ పర్యటనలపైనే మోజెక్కువని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని అమేథికి వెళ్లారు. అక్కడ పంట నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమేథీలో ఫుడ్ పార్కులను తొలగించడం అన్యాయమన్నారు. రాహుల్‌గాంధీ మోడీ ఏడాది పాలనపై విరుచుకుపడ్డారు. మోడీ ఏడాది కాలంలో ప్రజలకు చేసిందేవిూ లేదని చెప్పారు. మోడీ పాలనకు రాహుల్ గాంధీ 10 మార్కులకు గానూ ‘0’ మార్చులిచ్చారు. మోడీ ప్రభుత్వం రైతులు, పేదల జీవితాలతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. వారిని మోసం చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తోందన్నారు. పేదలు, రైతుల పక్షాన తాము నిరంతరం పోరాటం చేస్తామని ఉద్ఘాటించారు. సొంత నియోజకవర్గమైన అమేథీలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.. రైతులకు మేలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పునరుద్ఘాటించారు. పుడ్ పార్క్ అమేథితో పాటు నాలుగైదు జిల్లాల పరిస్థితిని మార్చేస్తుందన్నారు. పుడ్ పార్క్ ఏర్పాటు వల్ల పలువురికి ఉపాధి లభిస్తుందన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పుడ్ పార్క్ ఏర్పాటు చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. రెండు నెలల విరామం తర్వాత రాహుల్ తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఫుడ్ పార్క్ ఏర్పాటు కోసం ఆయన ప్రభుత్వంపై పోరాటం చేపట్టారు. అమేథిలో మోదీ సర్కార్ రద్దు చేసిన ఫుడ్ పార్క్‌ను తిరిగి ఏర్పాటు చేసేందుకు రాహుల్ నడుం బిగించారు. కావాలనే మోదీ ప్రభుత్వం రైతులను దెబ్బతీస్తుందని రాహుల్ విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం రాహుల్ గాంధీ విూడియాతో మాట్లాడుతూ రైతులు తమ పంటను నేరుగా ఫ్యాక్టరీలో అమ్మితే లాభం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దాని కోసం మేం ఫుడ్ పార్క్ తీసుకురావాలనుకుంటున్నామని ఆయన అన్నారు. దాని వల్ల ఐదారు జిల్లాలకు లాభం కలుగుతుందని ఆయన అన్నారు. కానీ మోదీ ప్రభుత్వం దాన్ని లాక్కుందని రాహుల్ మండిపడ్డారు. రైతుల నుంచి దాన్ని లాక్కున్నారుగానీ, నా నుంచి దాన్ని లాక్కోలేరని ఆయన అన్నారు. ఫుడ్ పార్క్ కోసం పోరాడతామని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, ఫుడ్ పార్క్‌ను వెనక్కి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమేథి వెళ్లిన ఆయన మంగళవారం కాసరా గ్రామంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు. పలు చోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారని.. ఎంపీ నిధుల నుంచి నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ సింగ్ తెలిపారు.ఇటీవల కేంద్ర మంత్రి స్మృతి ఇరాని అమేథిలో పర్యటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన నష్టనివారణ కోసం పర్యటన చేపట్టారు.