మోదీ పెట్టుబడిదారీ స్నేహితుల కోసమే నోట్ల రద్దు – రాహుల్‌ విమర్శలు

 

న్యూఢిల్లీ,నవంబరు 8 (జనంసాక్షి):మరోవైపు నోట్ల రద్దు నిర్ణయాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. తన పెట్టుబడిదారీ స్నేహితులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా మోదీ నోట్ల రద్దును తీసుకువచ్చారని ఆరోపిస్తూ రాహుల్‌ ట్విటర్‌ వేదికగా ఓ వీడియోలో విమర్శలు గుప్పించారు. ”ఒకప్పుడు ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్‌ ఇప్పుడు బంగ్లాదేశ్‌ కన్నా దిగజారిన పరిస్థితి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తే.. కరోనా వైరస్‌ అందుకు కారణమని ప్రభుత్వం చెబుతోంది. మరి బంగ్లాదేశ్‌ సహా ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ కొవిడ్‌ వ్యాప్తి చెందింది కదా! మరి వారిపై లేని ప్రభావం భారత్‌పైనే ఎందుకు..? ఈ పరిస్థితికి నాలుగేళ్ల కిందట తీసుకున్న నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలే కారణం. నోట్ల రద్దు వల్ల కూలీలు, దుకాణదారులు, రైతులపై కోలుకోలేని దెబ్బపడింది. ఆ నిర్ణయం వల్ల దేశ ఆర్థికం రెండు శాతం క్షీణించినట్లు ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్‌ సైతం చెప్పారు. కానీ మోదీ మాత్రం నల్లధనంపై చేస్తున్న పోరాటంగా దీన్ని అభివర్ణించారు. మోదీ ప్రజల డబ్బు తీసుకుని ఇద్దరు, ముగ్గురు పెట్టుబడిదారీ స్నేహితుల చేతిలో పెట్టారు. మరోవైపు జీఎస్టీ నిర్ణయం కారణంగా చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో ఆయన స్నేహితులకు వ్యాపార మార్గం సులభం చేసుకున్నారు. ఇప్పుడు రైతులను మరింత బలహీన పరచడానికి మూడు నూతన చట్టాలను తీసుకొచ్చారు” అంటూ రాహుల్‌ విమర్శలు గుప్పించారు.