మోదీ ప్రభుత్వం రైతులను హింసిస్తోంది.

– నూతన వ్యసాయచట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్ధతివ్వాలి

– రాహుల్‌ గాంధీ, ప్రియాంక

దిల్లీ,నవంబరు 30(జనంసాక్షి): ‘మోదీ ప్రభుత్వం రైతులను హింసిస్తోందని, భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలవాలని కాంగ్రెస్‌ ప్రధాన నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ దేశ ప్రజలను అభ్యర్థించారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండానే రైతు చట్టాలను ఎలా చేస్తారని కేంద్రంపై మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చారు. ఇప్పుడు వారివిూదే లాఠీలు ప్రయోగిస్తున్నారు. కానీ రైతులు గొంతెత్తినప్పుడు అది దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని కేంద్రం మర్చిపోయింది. కర్షకుల సమస్యలపై పోరాడదాం.. మాతో ఏకం కండి’ అంటూ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ద్వారా దేశ ప్రజలకు వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. రైతుల పోరుపై ప్రజలంతా గొంతెత్తాలని ప్రియాంక గాంధీ కోరారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొందరు బిలియనీర్లకు మాత్రమే ఈ చట్టాలు లాభం చేకూరుస్తాయని ఆమె ఎద్దేవా చేశారు. ‘పేరుకు మాత్రమే రైతు చట్టం. కానీ ప్రభుత్వంతో స్నేహంగా మెలుగుతున్న కొందరు బిలియనీర్లకు మాత్రమే ఈ చట్టాలు లాభిస్తాయి. రైతులను సంప్రదించకుండానే రైతు చట్టాలు ఎలా చేస్తారు? కర్షకుల వేదనను ప్రభుత్వం పట్టించుకోవాలి. అందరం ఏకమై రైతులకు మద్దతుగా నిలుద్దాం’ అని ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు.కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన చలో దిల్లీ ఆందోళన సోమవారంతో ఐదో రోజుకు చేరింది. పంజాబ్‌తోపాటు పలు రాష్ట్రాలనుంచి దిల్లీకి చేరుకున్న రైతులు ఆందోళన చేపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.