మోదీ మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు..!

Congress delegation meeting with Presidentప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించటం ద్వారా ప్రజాస్వామ్యంతోపాటు ప్రతిపక్షాల నోరు నొక్కుతోందని పదహారు ప్రతిపక్ష పార్టీల నాయకులు గురువారం రాత్రి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా తగు చర్యలు తీసుకోవాలని వారు ప్రణబ్ ముఖర్జీని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో లోక్‌సభలో టిఎంసి పక్ష నాయకుడు సుదీప్ బంధోపాధ్యాయ, కాంగ్రెస్‌పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, సిపిఎం సీనియర్ నాయకుడు సలీం, జ్యోతిరాదిత్య సింధియా తదితర పదహారు పార్టీల నాయకులు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటులో ఏకపక్షంగా వ్యవహరించటంపై ఒక వినతిపత్రం సమర్పించారు. ‘ఆదాయ పన్ను చట్టం సవరణ బిల్లుపై చర్చ జరగాలని తాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము, సవరణ బిల్లుకు ప్రతిపక్షం సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించారు. అయితే ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేసుకున్నది’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు.