మోదీ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ
` రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన తెలంగాణ ఉద్యమకారులు
` రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణుల భారీనిరసనలు
` ఎక్కడిక్కడ మోడీ దిష్టి బొమ్మల దహనం
` ర్యాలీలు,నిరసలనలతో హోరెత్తిన తెలంగాణ
` మోడీ వ్యతిరేక నినాదాలతో ఆందోళనలు
హైదరాబాద్,ఫిబ్రవరి 9(జనంసాక్షి): మోడీ ఉద్దేశం ఏదైనా ఆయన వ్యాఖ్యలు తెలంగాణ వాసులను మరోసారి గాయపరిచాయి. దశాబ్దాల తరబడి పోరాడి సాధించికున్న రాష్ట్రంపై ఈ వ్యాఖ్యలు ఏంటని గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి.ఈ క్రమంలో బుధవారం ఆందోళనలకు పిలుపునిచ్చాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. నిరసనగా గన్‌పార్క్ దగ్గర టీఆర్‌ఎస్ ఆందోళనకు దిగింది. నల్ల జెండాలతో నిరసన తెలిపింది. మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వివిధ నియోజకవర్గాల నుంచి గన్‌పార్క్ వరకూ టీఆర్‌ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించింది. మంత్రి తలసాని, ఎమ్మేల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. గన్‌పార్క్ దగ్గర టీఆర్‌ఎస్ నేతలు మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. అమరవీరుల స్థూపానికి పాలాభిషేకం చేశారు.ఊరూరా బీజేపీ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నాయి. నల్లజెండాలతో నిరసన తెలుపుతున్నారు. భారీ ఎత్తున బైక్ ర్యాలీలు తీసారు. తెలంగాణ పోరాటాన్ని అవమానపరిచిన మోడీ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తక్షణం తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు కావస్తున్నప్పటికి బిజెపి ప్రభుత్వానికి తెలంగాణపై విషం చిమ్మడం, నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం సరి కాదంటూ మండిపడ్డారు. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ నగరంలో నల్లజెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి మంత్రి గంగుల కమలాకర్ నిరసన తెలిపారు. మోదీ వైఖరిని ఎండగడుతూ ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్ రావు పూలమాల వేశారు. అనంతరం ఐబీ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. పట్టణంలోని పురవీధుల గుండా నల్ల బ్యాడ్జీ లతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసనలు పోటెత్తాయి. తక్షణం తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి 8 ఏండ్లు కావస్తున్నప్పటికి బిజెపి ప్రభుత్వానికి తెలంగాణపై విషం చిమ్మడం, నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం సరి కాదంటూ మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున మోదీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్ వాడ నియోజకవర్గాల్లో ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేశారు. మోదీ దిష్టి బొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశారు. వెంటనే ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ తన తీరు మార్చుకోకుంటే గ్రామాల్లో తిరగనివ్వమన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.