మోషేన్‌రాజు తొలగింపు వెల్లువెత్తిన నిరసన కొనసాగుతున్న దళితుల రాస్తారోకో, ధర్నా
ఏలూరు, జూలై 28 : మిన్నంటిన ఆగ్రహ జ్వాలలు.. పశ్చిమ వైఎస్‌ఆర్‌సిపిలో ముసలం. మోషేన్‌రాజు తొలగింపుపై రోడ్డెక్కిన దళితవర్గాలు.. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్న దళితులంతా మోషేన్‌రాజు తొలగింపు వ్యవహారం దళితుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయం దళితుల మనోభావాలను దెబ్బతీసిందని వారంతా ఆందోళనబాట పట్టారు. జిల్లా పార్టీలో కొందరు మాజీ ఎమ్మెల్యేలకు తోడు మరో ఎమ్మెల్యే వ్యవహారం వల్లే ఇంత రాద్దాంతం జరిగిందని మోషెన్‌రాజును ఉద్దేశపూర్వకంగానే తొలగించారంటూ దళితులు రోడ్డెక్కారు. శనివారంనాడు పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మోషెన్‌రాజును అర్ధాంతరంగా తప్పించాల్సిన పరిస్థితి ఏమొచ్చిందని దళిత సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని సైతం వదులుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో జిల్లా బాధ్యతలను సమర్ధవంతంగా నడిపిన మోషెన్‌రాజు తొలగింపు కుట్ర అంటూ దళితవర్గాల నేతలు నిరసనల ధ్వనులతో హోరెత్తించారు. ఏలూరులో వైఎస్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడిన దళితులు మోషేన్‌రాజు తొలగింపు చర్యలపై ధర్నా నిర్వహించారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని పెద్ద గలాటా సృష్టించారు. జై జగన్.. మోషెన్‌రాజు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరచడం దారుణమని మోషెన్‌రాజును ఎందుకు తొలగించారో సంజాయిషి చెప్పాలని జగన్‌కు సవాల్ విసిరారు. మోషెన్‌రాజును తొలగిస్తే తమ పదవులకు కూడా రాజీనామా చేసి పార్టీకి ఉద్వాసన చెబుతామని వైఎస్‌ఆర్‌సిపి దళితనేత మాథ్యూస్ హెచ్చరిస్తే, పెదవేగి మండలానికి చెందిన బీసీ నాయకులు నాగబాబు జిల్లాలో బీసీలు, ఎస్‌సిలను అణగదొక్కే కుట్ర జరుగుతోందని ఆవేదన వెలిబుచ్చారు. నర్సాపురం, పోలవరం ఉప ఎన్నికల వరకు మోషేన్‌రాజును వాడుకుని ఇప్పుడు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని, నర్సాపురంలో పార్టీ ఓటమికి మోషేన్‌రాజును బాధ్యుడ్ని చేయడం దుర్మార్గమన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం దళితులను అవమానపరిచే విధంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు దళితులు పూర్తిగా దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నర్సాపురంలో పత్రికలకు ప్రకటన జారీచేసిన పార్టీ ఎస్‌సి విభాగం జిల్లా కన్వీనర్ వందలపూరి ఏషయ్య కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాలకొల్లు, భీమవరం, చింతలపూడి, కొవ్వూరు, గోపాలపురం నియోజకవర్గాల్లోను దళిత నేతలు ఆందోళన నిర్వహిస్తున్నారు. కాగా జిల్లా కొత్త కన్వీనర్‌గా మొదట్లో పోలవరం ఎమ్మెల్యే బాలరాజును నియమిస్తారని ప్రచారం జరిగింది. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తోట గోపి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య పార్టీలో తలెత్తిన ఈ సంక్షోభంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మోషేన్‌రాజును తొలగించడం సబబు కాదన్న అభిప్రాయాన్ని ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మోషెన్‌రాజు తొలగింపు చర్య త్వరలోజరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీపై ప్రతికూల వాతావరణం సృష్టిస్తుందన్న వాదన కూడా వినవస్తోంది.