మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకుల చర్యలు

– రూ. 50కోట్ల పైబడి రుణాలపై బ్యాంకుల ఆరా
– రుణగ్రహీత ఆర్థిక పరిస్థితులపై ఆరా
న్యూఢిల్లీ, జ‌నం సాక్షి ) : వరుస మోసాలు, పెరిగిపోతున్న మొండి బకాయిలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సతమతమవుతున్నాయి. కొందరు పెద్దలు బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణాలు తీసుకోవడం.. ఆ తర్వాత వాటికి ఎగనామం పెడుతుండటం షరా మామూలైపోయింది. దీంతో ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు చర్యలు చేపట్టాయి. రూ.50కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేసేందుకు సిద్ధమయ్యాయి. కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాల మేరకే బ్యాంకులు ఈ చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్యాంకుల నుంచి రూ.50కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న ఖాతాలను ఆడిట్‌ చేసి వారు ఆ డబ్బు తిరిగి చెల్లించగలరో లేదో పరిశీలించనున్నాయి. అలా చెల్లించకుండా నిరర్ధక ఆస్తులుగా మారే ఖాతాలను గుర్తించి ప్రభుత్వం, నిఘా సంస్థలకు సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఓ ఛాలెంజింగ్‌ టాస్క్‌ను చేపట్టామని. రూ. 50 కోట్లు అంతకంటే ఎక్కువ రుణాలు తీసుకున్న అకౌంట్లను ఆడిట్‌ చేస్తున్నామని ఓ బ్యాంకు ఉన్నతాధికారి వెల్లడించాడు. మోసాలను గుర్తించేందుకు ఈ చర్యలు చేపట్టామని, నిరర్ధక ఆస్తులుగా మారే అవకాశమున్న ఖాతాలను గుర్తించి సెంట్రల్‌ ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో నుంచి ఆ ఖాతాదారుడి స్టేటస్‌ రిపోర్ట్‌ను తీసుకుంటాం అని పేరు తెలిపాడు. మోసాలకు పాల్పడేవారిని, నిధులను దుర్వినియోగం చేసేవారిని, ఉద్దేశపూర్వక ఎగవేతదార్లను గుర్తించేందుకు బ్యాంకులు ఈ ఆడిట్‌ చేస్తున్నాయి. అలాంటి ఖాతాలను గుర్తించి సీబీఐకి సమాచారమివ్వనున్నాయి. ఆ తర్వాత సీబీఐ అధికారులు వారిపై చర్యలు చేపట్టేందుకు అవకాశముంటుంది. ఇటీవల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13వేల కోట్లకు పైగా భారీ కుంభకోణం వెలుగుచూసిన విషయం తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, ఆయన బంధువులు బ్యాంకును మోసం చేసి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అప్రమత్తమైన కేంద్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలపై దృష్టి సారించింది. రుణాలు ఇచ్చే విషయంలో కొన్ని నిబంధనలు కూడా తీసుకొచ్చింది. రూ. 50కోట్లు అంతకంటే పైబడిన రుణాలు తీసుకోవాలంటే ఖాతాదారుల పాస్‌పోర్టును తప్పనిసరి చేసింది.