మౌనం వెనుక భారీ వ్యూహం!!

` ప్రతిపక్షాల దూకుడుకు కళ్లెం వేసేలా గులాబీ దళపతి అస్త్రాలు
` రైతులకు పింఛన్‌.. 5వేలు ప్రకటించే అవకాశం
` వ్యవసాయ కార్మికులను ఆదుకునేందుకు కొత్త పథకాలు
` ప్రతి మహిళకూ పెన్షన్‌.. రైతుబంధు పెంపునకు యోచన
` సామాన్యులపై గ్యాస్‌‘బండ’ తగ్గించేందుకు ప్రత్యేక సబ్సిడీలు?
` కొన్ని నెలలుగా సీఎం కేసీఆర్‌ సైలెంట్‌ పాలిటిక్స్‌పై సర్వత్రా ఆసక్తి
` అతి త్వరలో ప్రజలను ఆకట్టుకునే స్కీంలు ప్రకటించే ఛాన్స్‌..!
(జనంసాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌):ప్రతిపక్ష నేతలు వరుస సభలూ, సమావేశాలతో బిజీబిజీగా గడుపుతుంటే సీఎం కేసీఆర్‌ మౌనం వహించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది రాజకీయ వర్గాల్లో కొత్త ఆసక్తి రేకెత్తిస్తుండగా.. ఆయన వ్యూహ చతురత తెలిసినవాళ్లు మాత్రం మరే అంశంతో తెరపైకి వస్తారోనని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన రోజే తమ అమ్ముల పొదిలో అనేక అస్త్రాలున్నాయని, ఎన్నికలకు ముందు వాటిని సంధిస్తామని ఆయన ప్రకటించిన విషయం విదితమే. నాటినుంచి నేటివరకూ గులాబీ అధినేత పెద్దగా రాజకీయపరమైన అంశాలను ప్రస్తావించకపోవడం, ఇతర పార్టీల జాతీయ నేతలు హడావుడి చేస్తున్నప్పటికీ వాటిపట్ల దృష్టిసారించకపోవడం వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు తెలిసింది. పేద, మధ్య తరగతి ప్రజానీకానికి మేలు చేయడమేగాక వ్యవసాయ కార్మికులు, మహిళా సాధికారతకు ఆయన పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలతో ప్రజలను ఆకర్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారానికెళ్తోంది. తుక్కుగూడలో స్వయంగా ప్రకటించిన సోనియా గాంధీ పార్టీ క్యాడర్‌లో నూతనోత్తేజం నింపేలా తన ప్రసంగాన్ని కొనసాగించారు. కర్నాటక ఫార్ములాతో తెలంగాణలోనూ ఆశాభావంతో ఉన్న ఆ పార్టీ.. అభ్యర్థులను ప్రకటించకపోయినా అధికారమే లక్ష్యంగా కార్యచరణ కొనసాగిస్తోంది. తెలంగాణలో ‘వికసించని’ కమలం పార్టీ అగ్రనేతలు సైతం వరుస సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మోడీ, షా, నడ్డాలు మూడేసి మొత్తం తొమ్మిది సభలు నిర్వహించి జోష్‌ పెంచేలా రాష్ట్ర క్యాడర్‌ను సమయాత్తం చేస్తున్నారు. ఇలా ప్రతిపక్ష పార్టీలు విజృంభించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నా.. గులాబీ దళపతి మాత్రం గత కొన్ని నెలలుగా రాజకీయ పరమైన అంశాలకు దూరంగా ఉండటం గమనార్హం. ఇప్పుడిదే తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే గత వారం పదిరోజులుగా సీఎం కేసీఆర్‌ వైరల్‌ ఫీవర్‌, దగ్గుతో బాధపడుతున్నారని మంత్రి కేటీఆర్‌ స్వయంగా ప్రకటించడం కాస్త క్లారిటీ ఇచ్చినట్టే అనిపిస్తున్నప్పటికీ.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సుదీర్ఘకాలంగా ‘రాజకీయ మౌనం’ వహించడమే పెద్ద చర్చకు దారితీస్తోంది. గతంలో చెప్పినట్టు కొత్త అస్త్రాలతో ఆయన సిద్ధమవుతున్నట్టూ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఊహించని స్కీమ్స్‌..!
ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్‌ అభయ ‘హస్తం’ ఇవ్వగా.. సీఎం కేసీఆర్‌ అంతకుమించి వ్యూహాలు అమలు చేసేలా సన్నద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. ప్రతిసారీ మౌనం వెనుక జూలు విదిల్చినట్టే.. ఈసారి కూడా ప్రతిపక్షాలకు అంతుచిక్కని ప్రకటన చేయబోతున్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పేద, మధ్య ప్రజానీకమే లక్ష్యంగా వారికి కొత్త పథకాలు సంధించనున్నట్టు తెలిసింది. ప్రతి రైతుకూ పెన్షన్‌, వ్యవసాయ కార్మికులను ఆదుకునేలా సీఎం కేసీఆర్‌ యోచిస్తున్నట్టు సమాచారం. కొత్త రేషన్‌ కార్డులు మంజూరుతో పాటు ప్రతి మహిళకూ అండగా నిలిచేలా పింఛన్‌ అందించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రైతుబంధు పెంపుతో పాటు యువతకు దన్నుగా నిలిచేలా ఆయన భారీ ప్రణాళికలు చేయబోతున్నారు. ఐదేళ్లకొకసారి నిత్యావసర ధరలు పెరుగుతున్న దృష్ట్యా సామాన్యులపై ‘ధరాభారం’ తగ్గించేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు చేపట్టబోతున్నారు. ప్రధానంగా గ్యాస్‌బండ భారం పడకుండా ప్రత్యేక రాయితీలు కూడా అందించనున్నారని తెలిసింది. ఇప్పటికే ఎన్నో పథకాలతో దేశం చూపును తెలంగాణవైపు తీసుకురాగలిగిన గులాబీ దళిపతి.. అతి త్వరలోనే ప్రతిపక్షాలకు దిమ్మదిరిగేలా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. గత కొంతకాలంగా మౌనంగా ఉంటున్న ఆయన తెలంగాణ రాజకీయాల్లో మరొకసారి రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.