మౌనమేలనోయి !

ఊరంతా ఓ వైపు.. ఉలికి పిట్ట మరో వైపు
మార్చ్‌పై నోరు విప్పని కేసీఆర్‌
క్యాడర్‌ అసహనం
ఒంటరి అవుతున్న టీఆర్‌ఎస్‌
సన్నాహక మార్చ్‌లో పాల్గొనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు
కేసీఆర్‌కు ఏమైంది ? యావత్‌ తెలంగాణ ప్రజలు ఈ నెల 30న కవాతు కోసం సన్నాహాలు చేసుకుంటున్నా, మార్చ్‌లో పాల్గొనేది, లేనిది స్పష్టం చేయడంలో ఆలస్యమెందుకు చేస్తున్నాడు ? మౌనముని పాత్రను ఎందుకు పోషిస్తున్నాడు ? తెలంగాణ మార్చ్‌పై తమ పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ఎందుకు ప్రకటించడం లేదు ? పార్టీలోని హరీశ్‌రావు లాంటి కొందరు కవాతులో పాల్గొంటామని చెప్తున్నా, ప్రజలు ఆ వ్యాఖ్యలు కేసీఆర్‌ నోట వినాలనుకుంటారనే విషయం ఆయనకు కూడా తెలుసు. అయినా, ప్రజాభిప్రాయాన్ని కేసీఆర్‌ ఎందుకు పట్టించు కోవడం లేదు. పార్టీ నాయకులను అడిగితే ఢిల్లీలో ఉన్నాడు, తెలంగాణ ఏర్పాటుపై చర్చలు జరుపుతున్నాడని అంటున్నారు. కానీ, మీడియాలో మాత్రం త్వరలో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ విలీనం అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల వెనుక ఆంతర్యమేమిటి ? మీ పార్టీ మీ ఇష్టం ! వీలినమే చేసుకోండి. ఇంకేమన్నా చేసుకోండి. ఆ విలీనానికి బదులు మీరుఆశిస్తున్న ఫలితమేమిటి ? ఇది ప్రజలకు స్పష్టం చేయాలి. ఇదిలా ఉంటే కేసీఆర్‌ అనేకసార్లు తమ పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర సాధన కోసమని చెప్పి ఉన్నారు. మరలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఓ మైలురాయిగా నిలవనున్న తెలంగాణ మార్చ్‌పై స్పష్టమైన ప్రకటన చేయకపోవడంలో ఉన్న దాపరికమేమిటో అంతుబట్టడం లేదు. ఢిల్లీలో ఉన్నా, అక్కడి నుంచే కవాతుపై ప్రకటన చేయవచ్చని అందరికీ తెలిసిందే. కానీ, చేయడం లేదు. ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారని తెలిసినా, ఆ చర్చల్లో ప్రస్తావనకు వస్తున్న విషయాలను కూడా ప్రజలకు వివరించడం లేదెందుకు ? నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశంపై జరుగుతున్న చర్చల విషయాలను ప్రకటించాల్సిన అవసరం లేదని కేసీఆర్‌ భావిస్తున్నారా ? అయినా, ఇంతకాలం జరిగినవి చర్చలే కదా ! ఈ చర్చలతో తెలంగాణ రాదని తేలిపోయింది. చెమటోడ్చి ఉద్యమిస్తేనే తెలంగాణ వస్తుందని తెలిసిపోయింది. మరిప్పుడు కేసీఆర్‌ జరుపుతున్న చర్చలతో లాభముంటుందని ఓ తెలంగాణవాది ఎలా నమ్ముతాడు. అందుకే, తెలంగాణ మార్చ్‌కు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే, తెలంగాణ మార్చ్‌ తమ జేఏసీ నాయకత్వంలో కాకుండా, తమ పార్టీ నాయకత్వంలో జరగాలని కేసీఆర్‌ కోరుకున్నారా ? ఇదే కోరుకుంటే జేఏసీ నాయకులతో చర్చలు జరుపవచ్చు కదా ! ఎందుకు జరపలేదు ? ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిర్వహించనున్న తెలంగాణ మార్చ్‌తో సంబంధం లేకుండా ఎందుకుంటున్నారు ? తెలంగాణకు మార్చ్‌కు రిహార్సల్‌గా కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ‘కరీంనగర్‌ టార్చ్‌’ పేరిట నిర్వహించిన కవాతుకు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులెవరూ రాలేదు. ఛోటామోటా నాయకులు తప్ప. ఆ పార్టీకే చెందిన ఐదుగురు జిల్లా ఎమ్మెల్యేలు ఆ రోజు ఎక్కడున్నారో తెలియరాలేదు. దీంతో ఆగ్రహించిన మార్చ్‌కు వచ్చిన ప్రజలు మాతో కలిసిరాని వారు ఉద్యమ ద్రోహులేనని నినదించారు. అనేక ప్రజా సంఘాలు, కొత్త సంస్థలు జేఏసీతో కలిసి తెలంగాణ మార్చ్‌లో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారు. సీపీఐ పార్టీ కూడా కదం తొక్కేందుకు ఉవ్విళ్లూరుతున్నది. ఇటువంటి కీలక సమయంలో ఉద్యమ పార్టీగా చెప్పుకునే కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ అందరి కంటే ముందుండాలని ప్రజలు కోరుకుంటారు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఇంకా తెలంగాణ మార్చ్‌పై అధికారిక ప్రకటన చేయకుంటే, ముమ్మాటికీ నష్టపోయేది టీఆర్‌ఎస్సే. మార్చ్‌కు ఇంకా కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికైనా తెలంగాణ మార్చ్‌లో టీఆర్‌ఎస్‌ ముందుంటుందని కేసీఆర్‌ అధికారికంగా ప్రకటిస్తే మంచిది. లేకుంటే భవిష్యత్తులో కేసీఆర్‌ ఒంటిరి కాక తప్పదు. ఇది ప్రజాభిప్రాయమని గుర్తించాలి. ఇప్పటికే సగాని కన్నా ఎక్కువ మంది తెలంగాణ ప్రజలు జేఏసీ వైపే ఉన్నారన్నది నగ్న సత్యం. తెలంగాణ మార్చ్‌పై అవగాహన కలిగించడానికి జేఏసీ నిర్వహిస్తున్న సన్నాహక ర్యాలీల్లో పాల్గొంటున్న జనసంద్రమే ఇందుకు సజీవ సాక్ష్యం. ఈ సత్యాన్ని కూడా కేసీఆర్‌ తెలుసుకోవాలి. లేకుంటే, కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు మున్ముందు గడ్డుకాలం తప్పదు. దీని వల్ల లాభ పడేది జగన్‌లాంటి సమైక్యవాదులు అని ఆయన గమనించాలి. తెలంగాణ మార్చ్‌కు ముందే, అంటే, నేడో రేపో ఈ ఉద్యమ మైలురాయిపై కేసీఆర్‌ తమ పార్టీ అభిప్రాయాన్ని అధికారికంగా ఢిల్లీ నుంచైనా ప్రకటిస్తే మంచిది. లేకుంటే, రేపు ట్యాంక్‌ బండ్‌పై జరిగే మార్చ్‌కు కేసీఆర్‌ డైరెక్ట్‌గా వచ్చి పాల్గొన్నా, ప్రజల్లో ఏదో మూల అసంతృప్తి ఉంటుంది. అందుకే, కేసీఆర్‌ మౌనం వీడాలి. తెలంగాణపై మార్చ్‌పై అధికారిక ప్రకటన చేయాలి.