మ్యాగీ నూడుల్స్‌పై విచారణకు ఆదేశించిన కేంద్రం
పలు రాష్ట్రాల్లో నిషేధం
తెలంగాణలో అమ్మకాలు నిలిపివేత : మంత్రి లక్ష్మారెడ్డి
తాఖీదులు అందాక స్పందిస్తా:అమితాబ్
న్యూఢిల్లీ,జూన్3(జనంసాక్షి): మ్యాగి నూడిల్స్ వ్యవహారంలో విమర్శలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి. ఇప్పటికే మ్యాగీలో సీసం శాతం ఎక్కువగా ఉందన్న వార్తలతో కేంద్రం దీనిపై విచారణకు ఆదేశించింది. దీంతో నెస్లే కంపెనీకి చెందిన మ్యాగీ నూడిల్స్ నాణ్యతపై దేశవ్యాప్తంగా పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ ఆహర భద్రత విభాగం మ్యాగీపై నిషేధం విధించిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కూడా మ్యాగీ శాంపిళ్లను పరిశీలించి వాటిని ఆహారంగా తీసుకోవడం హానికరమని, వాటిలో సీసం శాతం ఎక్కువగా ఉందని పేర్కొంది. దిల్లీ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లేబరేటరీలో మ్యాగీ శాంపిళ్లను పరిశీలించారు. ప్రాథమిక నివేదిక ప్రకారం అవి హానికరమని చెప్పారు. పూర్తి నివేదిక ఆధారంగా తదుపరి చర్య తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. దేశ రాజధాని దిల్లీలో మ్యాగీ నూడిల్స్ అమ్మకాలపై నిషేధం విధించారు. మ్యాగీపై 15 రోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తెలిపారు. ఫుడ్ సెక్యురిటీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అన్ని రాష్టాల్ర నుంచి మ్యాగీ నూడిల్స్ శాంపిళ్లను సేకరించి నాణ్యత పరీక్షలు చేస్తుందని కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. కేరళ ప్రభుత్వం ఇప్పటికే మ్యాగీ నూడిల్స్‌పై నిషేధం విధించింది. రిటైల్ దుకాణాలకు మ్యాగీ ప్యాకెట్లను సరఫరా చేయడం తాత్కాలికంగా నిలిపివేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. పశ్చిమ బంగ ప్రభుత్వం కూడా మ్యాగీ వివాదంపై నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది. హర్యానా, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా నూడిల్స్ శాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపాయి. తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి కూడా దీనిపై స్పందించి శాంపిల్స్‌ను పరీక్షలకు పంపుతామన్నారు. ప్రస్థుతానికి అమ్మకాలు నిషేధించినట్లు తెలిపారు. మాగీ వివాదంపై కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ స్పందించారు. మ్యాగీ వివాదంలో నిజానిజాలు వెలికితీస్తామన్నారు. దోషులుగా తేలిన వారికి శిక్ష తప్పదన్నారు. న్యూడిల్స్‌పై పరీక్షలు జరపాలని అన్ని రాష్టాల్రకు ఎఫ్‌డీఏ లేఖ రాసినట్లు తెలిపారు. నిత్యావసరాల వస్తువులు, ఆహారపదార్థాల కల్తీని, ఉత్పత్తులపై పేర్కొన్నవాటి కంటే భిన్న పదార్థాల్ని చేర్చడాన్ని నియంత్రించేందుకు నూతన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
ప్రచారకర్తలకు నోటీసులు
మాగీ ప్రచార కర్తలకు ఇప్పటికే కోర్టు తాఖీదులు పంపగా బిగ్‌బీ అమితాబ్ తనకింకా అవి అందలేదని, అందాక స్పందిస్తానని అన్నారు. ఉత్తరప్రదేశ్ ఆహార భద్రత విభాగం ఇప్పటికే మ్యాగీ కంపెనీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు మ్యాగీ ప్రచార కర్తలుగా వ్యవహరించిన బాలీవుడ్ నటులు మాధురీదీక్షిత్, అమితాబ్‌బచ్చన్, ప్రీతిజింతాలపై కూడా కేసులు నమోదు చేసింది. యూపీతో పాటు బిహార్‌లోని ఓ కోర్టు కూడా ఈ ముగ్గురు నటులపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.దేశ వ్యాప్తంగా ఉడుకుతున్న మ్యాగీ వివాదంపై దాని ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌బచ్చన్ స్పందించారు. ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, న్యాయ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ విషయమై అధికారుల నుంచి ఇంత వరకు తనకెలాంటి
నోటీసులు అందలేదని వెల్లడించారు. అయితే రెండేళ్ల క్రితమే తాను దీని ఒప్పంద నుంచి తప్పుకున్నానని అన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం మ్యాగీపై నిషేధం విధించి దీనిపై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.
పాలపొడిలో పురుగులు
ఇప్పటికే మ్యాగీలో సీసం శాతం ఎక్కువగా ఉందన్న వార్తలతో చిక్కుల్లో ఉన్న నెస్లేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తమిళనాడులోని కోయంబత్తూరులో నెస్లే పాలపొడిలో పురుగులను గుర్తించారు. ఓ క్యాబ్ డ్రైవర్ తన పిల్లల కోసం కొనుగోలు చేసిన పాలపొడిలో బతికున్న లార్వాను గుర్తించాడు. ముందు చూసుకోకుండా వాళ్ల బాబుకు ఆ పాలు పట్టించడంతో అతని ఒంటిపై దద్దుర్లు వచ్చాయి. దీంతో క్యాబ్ డ్రైవర్ ఆహార భద్రత అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు ఆ పాలపొడిని పరీక్షించి అందులో లార్వాలు ఉన్న సంగతి నిజమేనని ధ్రువీకరించారు