మ్యాన్‌ హోల్‌ లో చిక్కుకున్న కార్మికుడి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌5( జనం సాక్షి ): హైదరాబాద్‌ హయత్‌ నగర్‌ సర్కిల్‌ పరిధిలోని సాహెబ్‌ నగర్‌ మ్యాన్‌ హోల్‌ లో చిక్కుకున్న జీహెచ్‌ఎంసీ కార్మికుడు అంతయ్య కోసం రెస్క్యూ కొనసాగుతోంది. దాదాపు ముప్పై నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. అంతయ్య ఆచూకీ కోసం జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం నాలాను తవ్వుతోంది. ఇప్పటివరకు ఘటనాస్థలానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, మేయర్‌ వెళ్లలేదు. ఇప్పటికే కార్మికుడు శివ మృతదేహాన్ని సిబ్బంది బయటకు తీసింది. శివ మృతదేహానికి నేడు ఉస్మానియా ఆసుపత్రి లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. రాత్రిళ్లు నాలోకి దింపడమే ప్రమాదానికి కారణం. కాంట్రాక్టర్‌ స్వామిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజులు గడుస్తున్నా అంతయ్య కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలలో అంతయ్య కొట్టుకు పోయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. నాల పరివాహక ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది జల్లెడ పడుంతోది. కుంట్లూరు చెరువు వరకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ పనులను పరీశీలించారు. శివ, అంతయ్య అనే ఇద్దరు వ్యక్తులు జీహెచ్‌ఎంసీలో కార్మికులుగా పని చేస్తున్నారు. వీరిద్దరు డ్రైనేజీ రిపేర్‌ కోసం రాత్రి మ్యాన్‌ హోల్‌ లోకి దిగారు. రాత్రి పూట డ్రైనేజీ క్లీన్‌ చేసేందుకు అనుమతి లేదు. అయినప్పటికీ కాంట్రాక్టర్‌ ఒత్తడితో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డ్రైనేజీ క్లీన్‌ చేసేందుకు మ్యాన్‌ హోల్‌ లోకి దిగారు. ముందు శివ అనే కార్మికుడు ఊబీలో చిక్కుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన అంతయ్య కూడా ఊబిలో చిక్కుకుని ఊపరి ఆడక మృతి చెందారు. ఆ సమయంలో మ్యాన్‌ హోల్‌ పై ఇద్దరు కార్మికులు వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మున్సిపల్‌ సిబ్బంది శివ అనే కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అంతయ్య మృత దేహం కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతులు చింతల్‌ బస్తీకి చెందిన శివ, అంతయ్యగా గుర్తించారు. దీంతో చింతల్‌ బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. శివ భార్య 8 నెలల గర్బవతి. అంతయ్యకు భార్య, కుమారు, కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.