యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ భవనానికి సీఎం శ్రీకారం

హైదరాబాద్‌: యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో స్కూళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లకు స్థలాల సేకరణపై ఆరా తీశారు. గడువులోగా పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.

‘‘స్థలాలు కేటాయిస్తే అనుమతుల పనులు వేగవంతం చేయాలి. స్కూళ్లకు స్థలాలు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలి. అనువుగా లేని చోట ప్రత్యామ్నాయ స్థలం సేకరించాలి. కలెక్టర్లు వీలైనంత త్వరగా స్థలాలు గుర్తించాలి. దీనిపై వారంలోగా నివేదిక ఇవ్వాలి. 105 స్థానాల్లో రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలి. చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో సరైన వసతులు కల్పించాలి. వర్సిటీ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని సీఎం తెలిపారు.