యజమాని కుమారుడిని కాపాడేందుకు..

41463502362_625x300చెన్నై: యజమాని ప్రాణాలను కాపాడుతూ తన దూడతో సహా ఓ ఆవు ప్రాణాలు విడిచింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఐస్‌హౌస్ డాక్టర్ బీసెంట్‌రోడ్డుకు చెందిన పార్థసారథి పాల వ్యాపారం చేస్తున్నాడు. ఇందుకోసం ఒక ఆవును ప్రేమగా పెంచుకుంటున్నారు. ప్రతిరోజు ఆ ఆవును సమీపంలోని ఒక టీ దుకాణం వద్దకు తీసుకెళ్లి దుకాణం వారి ముందే పాలు పిండి ఇస్తుంటాడు. మంగళవారం ఉదయం పార్థసారథి కుమారుడు ఆవు, దూడలను తోలుకుని టీ దుకాణం వైపు బయల్దేరాడు. చెన్నైలో సోమవారం రాత్రి నుంచి పడుతున్న కుండ పోత వర్షం కారణంగా రోడ్డంతా నీటి ప్రవాహంతో ఉంది.

ముందువైపు ఆవు, దానిని అనుసరిస్తూ వెనుకగా దూడ, దాని వెనుక యజమాని కుమారుడు వరుసగా వెళుతున్నారు. అందరికంటే ముందు వైపు వెళుతున్న ఆవుకు ఏమనిపించిందో ఏమో అకస్మాత్తుగా వెనుకవైపు తిరిగి యజమాని కుమారుడిని కొమ్ములతో పొడిచినట్లుగా వెనక్కు తోసేసింది. దూరంగా కిందపడిన అతను తేరుకునేలోగా అక్కడి నీళ్లలో సరఫరా అవుతున్న విద్యుత్ సోకి రంకెలు వేస్తూ ప్రాణాలు వదిలింది. ఆవు అరుపులకు దూడ దగ్గరకు వెళ్లగా అది సైతం విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. కనురెప్పపాటులో జరిగిన ఈ సంఘటనతో యజమాని కుమారుడు నివ్వెరపోయాడు. తన ప్రాణాలను కాపాడి తనువు చాలించిన గోమాతను, దూడను చూసి అతను కన్నీళ్ల పర్యంతమయ్యాడు. పెద్ద సంఖ్యలో స్థానికులు సైతం గోమాతకు చేతులు జోడించి నమస్కరించారు.